బచ్చల మల్లి మూవీ రివ్యూ  : మచ్చల మల్లి

by | Dec 20, 2024 | సినిమా రివ్యూ

సినిమా                        : బచ్చల మల్లి

మార్కులు                   : 40/100

విడుదల తేదీ              : 20-12-2024

నిర్మాణ సంస్థ             : హాస్య మూవీస్

నటీ నటులు                : అల్లరి నరేష్,  అమృత అయ్యర్, రావు రమేష్,  రోహిణి, ప్రవీణ్, హరితేజ తదితరులు

సంగీతం                      : విశాల్ చంద్రశేఖర్

నిర్మాతలు                   : రాజేష్ దండా, బాలాజీ గుత్తా

రచన & దర్శకత్వం    : సుబ్బు మంగాదేవి

ఎన్ని ప్లాప్ లు వచ్చిన అల్లరి నరేష్ ప్రయోగాత్మక చిత్రాలు చేయడం మానరు.  ఈ బచ్చల మల్లి  కూడా ఒక ప్రయోగాత్మక చిత్రం.

కధ

1985 నాటి కాలంలోని కధ.  తన తండ్రి వేరే మహిళతో కలసి ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో, మల్లి చిన్నప్పటి తన తండ్రి మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు.  ఆ ద్వేషం తనతో పాటు పెరిగి పెద్దదవుతుంది.  ఎంతగా అంటే తన పతనానికి తానే దారులు వేసుకుంటున్నంతగా.  ఒక్కొక్కసారి అచ్చంగా రామ్ గోపాల్ వర్మ లా ఈ క్యారెక్టర్ మాట్లాడినట్లు అనిపిస్తుంది. 

సినిమాలో ఎక్కువగా మల్లి (అల్లరి నరేష్) తాగడం, తన్నడం లాంటి సన్నివేశాలే. కేవలం మూర్ఖత్వం నిండి ఉన్న ఒక క్యారెక్టర్ చుట్టూ తిరిగే కధ.  ఎవరు చెప్పిన వినడు, తనకు ఏది చేయాలనిపిస్తే అది చేసేయడం, ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడడం.  అలాంటి మూర్ఖుడు ప్రేమలో పడితే వచ్చే పర్యవసానాలు ఏంటి అనేది తర్వాత వచ్చే కధ

బలాలు 

మూర్ఖత్వం నిండిన క్యారెక్టర్లో అల్లరి నరేష్ అద్భుతమైన నటన

పరవాలేదనిపించేలా ఆఖరి 10-15 నిమిషాలు

బలహీనతలు

బలహీనమైన కధ, స్క్రీన్ ప్లే

అంతగా పండని ఎమోషనల్ సన్నివేశాలు

కామెడీ సన్నివేశాలు లేకపోవడం, సినిమా సీరియస్ గా సాగడం

విసుగు తెప్పించే 1985 కాలం నాటి పాటలు

విశ్లేషణ

బచ్చల మల్లి సినిమా కేవలం అల్లరి నరేష్ (ఒక మూర్ఖుడు) Characterization మీద నడించింది.  అందుకే క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలాసేపు తాగడం, తన్నడం లాంటి సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు.  ఇంతలోనూ అక్కడక్కడా మూర్ఖుడైన మల్లి కి మనసుంది అని చెప్పే చిన్న చిన్న సన్నివేశాలు రాసుకున్న అవి అంతగా వర్క్ అవుట్ కాలేదు. 

బచ్చల మల్లి తన తండ్రిని అంతగా ద్వేషించడానికి సరైన కారణం చూపించలేకపోయారు దర్శకుడు. ఎంతగా ద్వేషిస్తాడంటే ఆఖరికి చనిపోయిన తరవాత తలా కొరివి కూడ పెట్టడానికి ముందుకు రానంత ద్వేషం.  కేవలం తండ్రి, కొడుకుల మధ్య ప్రేమానుబంధం ఒక్క సన్నివేశంతో సరిపెట్టాడు.

ఇక కావేరి (అమృత అయ్యర్) బచ్చల మల్లి తో ప్రేమలో పడుతుంది.  ఈ ప్రేమ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు.   కావేరి తండ్రి (రావు రమేష్) వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోకపోవడం, వేరే వ్యక్తి తో పెళ్లి కుదర్చడం, ఊరి తగాదాలు వంటివన్నీ రొటీన్ సన్నివేశాలే.

నా సామిరంగా లో అల్లరి నరేష్ క్యారెక్టర్ చూసి దర్శకుడు ఈ కధ రాసుకుని ఉండచ్చు.  అయితే ఇలాంటి సినిమాలను థియేటర్లో చూడడానికి ప్రేక్షకులు ముందుకు రాకపోవచ్చు. టీవీ, ఓ టి టి ల ప్రభావం అధికంగా ఉన్న ఈ రోజుల్లో

కావేరి పాత్రలో అమృత అయ్యర్ పాత్రలో కొత్తదనం ఏమి లేదు.  హరితేజ కు పూర్తి నిడివి ఉన్న పాత్ర దక్కింది.  తన పరిధిలో తన పాత్రకు న్యాయం చేసింది.  రావు రమేష్ కు ఇలాంటి పాత్రలు కొత్తకావు. 

విశాల్ చంద్రశేఖర్ నేపధ్య సంగీతం బావున్నా బలమైన  సన్నివేశాలు లేకపోవడంతో సంగీతం తేలిపోయింది

కధానాయకుడి పాత్రను ఇంత నెగటివ్ గా చూపిస్తే మన ప్రేక్షకులు తట్టుకోలేరు. 

ఇలాంటి పాత్రలు, ఈ జెనెరేషన్లో పోషించడానికి చాలా ధైర్యం కావాలి.  అల్లరి నరేష్ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి ఇలాంటి ముగింపు ఇవ్వలేదు.  సినిమా 2024 లో విడుదలైన, 1985 కాలం నాటి కధకు ఆ కాలం ముగింపు ఇచ్చాడు దర్శకుడు.

చివరగా ఇచ్చిన సందేశం మూర్ఖత్వంతో, అహంకారంతో అయినా వాళ్ళందరిని దూరం చేసుకుని సాధించేది ఏమిటి అనే సందేశం ఇచ్చాడు దర్శకుడు.  సహజత్వానికి దగ్గరగా ఉండే ఇలాంటి చిత్రాలను తీసేటప్పుడు బలమైన కధ, కథనాలను రాసుకోవాలి.

ఈ మధ్య కాలంలో మన తెలుగు దర్శకులు కథల మీద కాకుండా క్యారేక్టరైజేషన్ మీద సినిమాలు తీస్తున్నారు. ఈ మధ్య వచ్చిన కల్కి, దేవర, పుష్ప చిత్రాలు కూడా ఈ కోవకు చెందినవే 

చివరగా బచ్చల మల్లి సినిమా ఎందుకు చూడాలి, ఎవరికోసం చూడాలి