మరో హిట్ కోసం మాస్టర్ ప్లాన్.. క్రేజీ విలన్‌తో భారీ స్కెచ్

by | Jan 30, 2026 | సినిమా

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, విక్టరీ వెంకటేష్ (Venkatesh) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. (Mana Shankara Vara Prasad Garu). ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని దాదాపుగా రూ.400 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించి టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ భారీ విజయం డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దాంతో అనిల్ రావిపూడితో సినిమా చేయాలని పలువురు అగ్ర హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదిలా ఉండగా, తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తదుపరి సినిమా కూడా సంక్రాంతికే వస్తుందని చెప్పిన ఆయన ఇప్పటివరకు తనకు కేరాఫ్ గా మారిన కామెడీ జానర్‌కు విరామం ఇచ్చి, డిఫరెంట్ జానర్‌లో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఎంత విభిన్నమైన కాన్సెప్ట్ తో సినిమా చేసినా అంతర్లీనంగా మాత్రం వినోదాన్ని మిస్‌ చేయనని పేర్కొన్నారు. తాను తర్వాత చేయబోయే ప్రాజెక్ట్‌పై ఎంతో ఉత్సాహంగా ఉన్నానని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. అయితే అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాలో విలన్ పాత్రకు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే అనిల్ రావిపూడి, ఫహద్ ఫాజిల్‌ (Fahad Fajil) ను కలిసి స్టోరీ డిస్కషన్ చేశాడని, కథలో తన పాత్ర నచ్చడంతో ఫహద్ కూడా వెంటనే అంగీకారం తెలిపినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఫహద్ ఫాజిల్‌ క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ముందు హీరోను ఎంపిక చేశాక విలన్ ను ఫిక్ చేస్తారు. కానీ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ముందుగానే విలన్ ను ఎంపిక చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.