‘ఆదిత్య 369’ రీ రిలీజ్.. స్పెషల్ అట్రాక్షన్‌గా ‘టైమ్ మెషిన్’

by | Apr 4, 2025 | సినిమా

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆదిత్య 369’ (Aditya 369). జూలై 18, 1991లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అఖండ విజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ ఫస్ట్ ఇండియన్ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందని, బాలయ్య గతంలోనే పలు సందర్భాల్లో చెప్పారు. ఇందులో బాలయ్య సరసన మోహిని హీరోయిన్ గా నటించగా.. సిల్క్ స్మిత, అమ్రిష్ పురి, టినూ ఆనంద్, మాస్టర్ తరుణ్, జేవీ సోమయాజులు, సుత్తివేలు, లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో అలరించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీత స్వరాలు అందించారు. ఇందులో శ్రీ కృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ (Bala Krishna) నటన.. జంధ్యాల సంభాషణలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్ళాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండగా.. మరోసారి ‘ఆదిత్య 369’ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా 4K తో డిజిటలైజ్ చేసి 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 220 థియేటర్స్ లో ఏప్రిల్ 4న రీ రిలీజ్ చేశారు.

అయితే ఈ ఐకానిక్ మూవీని బిగ్ స్క్రీన్ మీద మరోసారి చూసేందుకు సినీ ప్రియులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఆదిత్య 369’ (Aditya) సినిమా కోసం థియేటర్స్ కు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఎంతో కీలకమైన టైమ్ మెషిన్ ను ఈ మూవీ రీ-రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్ వద్ద ప్రదర్శనకు ఉంచారు. దీంతో ఇక్కడికి వస్తున్న ప్రేక్షకులు టైమ్ మెషిన్ (Time Machine) ను చూసి ఆస్వాదిస్తున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ‘అఖండ-2’ షూటింగ్‌లో బాలకృష్ణ బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో సెప్టెంబర్‌ 25న ఈ చిత్రం విడుదలకానుంది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.