విడుదల తేది: 11–04–2025
నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి, సత్య, గెటప్ శ్రీను, రోహిణి, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: ఎంఎన్. బాల్ రెడ్డి
ఎడిటర్: కొడాటి పవన్ కళ్యాణ్
సంగీతం: రధన్
నిర్మాణ సంస్థ: మాంక్స్ అండ్ మంకీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్
దర్శకత్వం: నితిన్-భరత్
తెలుగులో యాంకర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శక ద్వయం డుయో నితిన్, భరత్ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తుంది. మాంక్స్ అండ్ మంకీస్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సత్య, గెటప్‌శ్రీను, మురళీధర్‌గౌడ్, రోహిణి, ఝాన్సీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది వేసవి కానుకగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ఏప్రిల్ 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హీరోగా ప్రదీప్ మాచిరాజు ఆడియన్స్ ను ఎలా మెప్పించాడు? ప్రదీప్, దీపికల ప్రేమ కథ ఎక్కడి వరకు వెళ్లింది ? బాక్సఫీస్ వద్ద ప్రదీప్ మరోసారి మ్యాజిక్ చేశాడా ? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.
కథ
ఈ సినిమా కథ తమిళనాడు శివారులోని భైరిలంక గ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా రాజన్న (జీఎమ్ సుందర్) కుటుంబానికి చెందిన వారే సర్పంచ్‌గా ఎన్నికవుతూ వస్తుంటారు. అయితే, తనతోనే ఈ ఆచారం అంతమవ్వాలని ఆయన అనుకుంటాడు. అందుకే వివాహం కూడా చేసుకోకుండా.. ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు. అయితే, కొన్నేళ్లుగా ఆ ఊరిలో మగబిడ్డలు మాత్రమే పుడతారు. అలా 60 మంది మగవాళ్ల తర్వాత రాజా (దీపికా పిల్లి) పుడుతుంది. దాంతో ఆ గ్రామానికి అంతా కలిసివస్తుంది. ఆమె తమ ఊరికి దేవత అని అందరూ ప్రేమగా చూసుకుంటారు. అయితే రాజాను ఆ ఊరిలో పుట్టిన 60 మంది అబ్బాయిలలో ఒకరు పెళ్లి చేసుకోవాలని.. అతడికి సర్పంచ్ పదవి దక్కుతుందని రాజన్న చెబుతాడు. దీంతో రాజాను వివాహం చేసుకోవాలని 60 మంది అబ్బాయిలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఇంజనీర్ అయిన కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) వస్తాడు. రాజాను కృష్ణ ఎక్కడ పెళ్లి చూసుకుంటాడో అని ఆ 60 మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ తరుణంలోనే ఒకరోజు రాజా, కృష్ణ ఇద్దరూ ప్రేమలో పడతారు అయితే, రాజా, కృష్ణల పెళ్లికి రాజన్న ఒప్పుకున్నాడా? గ్రామస్తులు కృష్ణను రాజా భర్తగా అంగీకరించారా? ఆ 60 మంది కలిసి కృష్ణను అడ్డు తొలగించేందుకు ఏం చేశారు ? రాజా ప్రేమ కోసం కృష్ణ ఎదుర్కొన్న పరీక్షలేంటి? అనేదే సినిమా కథ.
విశ్లేషణ:
ప్రదీప్, దీపిక పిల్లి కాంబినేషన్‌లో సినిమా ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే అంచనాలు అందుకోవడంలో వీరిద్దరూ పూర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కృష్ణ అనే పాత్రలో ప్రదీప్ ఆకట్టుకున్నాడు. అయితే కామెడీ చేయడంలోనూ డైలాగ్స్ చెప్పడంలోనూ కాస్త తడబడినట్లు అనిపించింది. రాజా అనే పాత్రలో దీపిక కూడా చక్కగా ఒదిగిపోయింది. హీరోయిన్ పాత్రలో గ్లామర్ గా కనిపించినప్పటికీ ఎమోషన్‌ను పండించలేకపోయింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి. అయితే కొన్ని చోట్ల వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ పూర్తిగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ కథకు ఆటంకం కలిగించేలానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో సత్యతో పాటు గెటప్ శ్రీను కడుపుబ్బా నవ్వించారు. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు వీరిద్దరే కనిపిస్తారు. సెకండాఫ్‌లో మాత్రం కాస్త వినోదం తగ్గినట్టుగా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తమ కామెడీతో అలరించారు. చివర్లో కనిపించిన బ్రహ్మానందం నవ్వులు పూయించారు. ప్రదీప్ తల్లిదండ్రులుగా మురళీధర్ గౌడ్, రోహిణి ఆకట్టుకున్నారు. అయితే ఈ మూవీ క్లైమాక్స్ లో కథని ముగించిన తీరు అభిమానుల్ని ఆకట్టుకోలేదనే చెప్పాలి. రధన్ అందించిన సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేదు. బాల్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శక ద్వయం నితిన్-భరత్ సినిమా కథను పక్కాగా సిద్ధం చేసుకున్నప్పటికీ కథనంను నడిపించే విషయంలో కాస్త తడపడ్డారు అని చెప్పొచ్చు. పూర్తిగా కామెడితోనే ప్రేక్షకులను ఆకట్టుకోవలనే ఉద్దేశ్యంతో నితిన్, భరత్ ఈ సినిమాను తెరకెక్కించారని చెప్పవచ్చు. కథలో కొత్తదనం లేకపోయినా కామెడీతో ముందుకు తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఈ సినిమా నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
కామెడీ
సెకండాఫ్ లో ట్విస్టులు
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
ఆసక్తి రేకెత్తించని కథ, కథనాలు
రేటింగ్: 2.75/5

