Jaat | ఏప్రిల్ నెల మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘జాట్‌’

by | Apr 3, 2025 | సినిమా

చలనచిత్రాలకు సంబంధించి రేటింగ్‌ పరంగా మోస్ట్ పాపులర్ ఆన్‌లైన్‌ ప్లాట్ ఫామ్ గా పేరొందిన ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌ (ఐఎండీబీ) ప్ర‌తి ఏడాది అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల జాబితాను ప్ర‌క‌టిస్తుంద‌న్న సంగతి తెలిసిందే. అయితే ప్రతీ నెలలో కూడా అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాలను కూడా గుర్తించి జాబితా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగానే 2025, ఏప్రిల్ నెలకు గానూ తాజాగా మోస్ట్‌ అవైటెడ్‌ ఇండియన్‌ సినిమాలను ఐఎండీబీ (IMDB) అనౌన్స్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఎండీబీ వీక్షకుల రివ్యూల ఆధారంగా తాజాగా ఈ సినిమాల జాబితాను ప్ర‌క‌టించింది. ఐఎండీబీ మోస్ట్‌ అవైటెడ్‌ ఇండియన్‌ మూవీస్‌ ఫర్ ఏప్రిల్ 2025 లిస్ట్ పరిశీలిస్తే.. ఇందులో మొద‌టి స్థానంలో టాలీవుడ్ డైరెక్టర్‌ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్న జాట్‌ (Jaat) చిత్రం నిలిచింది.

ఈ సినిమాతో సన్నీడియోల్‌ (Sunnydeol) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. ఇందులో సయామీ ఖేర్ హీరోయిన్ గా నటించగా.. ఈ విలన్ పాత్రలలో రణదీప్ హుడా , వినీత్ కుమార్ సింగ్ నటించారు. రణదీప్ సరసన రెజీనా కసండ్రా నటించింది. అలాగే ‘జాట్’ మూవీ లోని ఫస్ట్ సింగిల్ ‘టచ్ కియా’ సాంగ్ లో ఊర్వశీ రౌతేలా చిందులేసింది. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎస్‌ థమన్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.