పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Hari Hara Veera Mallu) పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. కాగా, భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ విడుదల కోసం అటు అబిమానులు, ఇటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి 28న రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అఫీషియల్‌గా ప్రకటించింది. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనిపై మెగా అబిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక్కో పాటను విడుదల చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ వినాలి.. వీరమల్లు మాట వినాలి ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయగా ఇటీవల ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలకు అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. కాగా, మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

