పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడుగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘హరి హర వీరమల్లు’ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్ కోసం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘హరిహరవీరమల్లు’ లోని ‘కొల్లగొట్టిందిరో..’ అంటూ సాగే సెకండ్ సింగిల్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు.
‘కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో, కొంటెకొంటె చణుకులతో, కొలిమి లాంటి మగటిమితో, సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడు అంటూ సాగే ఈ సెకండ్ సింగిల్ ప్రోమో అభిమానుల్ని ఉర్రూతలుగిస్తోంది. ఈ పాటకి
కీరవాణి సంగీతం అందించగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. దీనిని మంగ్లీ, రమ్య బెహరా, యామిని ఘంటసాల, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్, నిధి ఆగర్వాల్‌లతో పాటుగా అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ స్టెప్పులేశారు. ‘కొల్లగొట్టినాదిరో’ ఫుల్ సాంగ్ ఫిబ్రవరి 24న విడుదల కాబోతుండగా..
ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

