రిలీజ్‌కి ముందే బిగ్ డీల్.. ‘కింగ్​డమ్​’ ఆడియో రైట్స్ ఎంతంటే ?

by | Feb 21, 2025 | సినిమా

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్​డమ్​’. ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍ గా నటిస్తోండగా.. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. విజయ్‌ దేవరకొండ సరికొత్త మేకోవర్‌తో గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపించారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.

ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సినీ ప్రేమికులు దీన్ని ప్రశంసించారు. ఇప్పుడు ‘కింగ్​డమ్​’ మూవీకి సంబంధించి బిజినెస్ పార్ట్ కూడా ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైపోయాయి. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ఏకంగా రూ. 35 కోట్ల మేరకు ఆడియో రైట్స్ డీల్ ముగించిందని సమాచారం. దీనిని ఆదిత్య మ్యూజిక్ సంస్థ కూడా అధికారికంగా దృవీకరించింది. అయితే అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ రికార్డ్ డీల్ కుదిరిందని తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే అనిరుధ్ ఈ చిత్రానికి అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారట. ఇదిలాఉంటే.. కింగ్​డమ్​ మూవీ చివరి షెడ్యూల్‌ను విశాఖపట్నంలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. . ఈ చివరి షెడ్యూల్‌తో ‘కింగ్​డమ్​’ మూవీ షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. కాగా, ‘కింగ్​డమ్​’ సినిమాను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.