సినిమా రివ్యూ: ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’

by | Feb 21, 2025 | సినిమా రివ్యూ

విడుదల తేది: 21–2–2025
నటీనటులు: పవీష్‌, అనిఖా సురేంద్రన్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌, మాథ్యూ థామస్‌, ప్రియాంకా ఆరుల్ మోహన్, వెంకటేష్ మేనన్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

ఛాయాగ్రహణం: లియోన్ బ్రిట్టో
సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
ఎడిటింగ్‌: ప్రసన్న జీకే
నిర్మాణ సంస్థ: వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్కే ప్రొడక్షన్స్
దర్శకత్వం: ధనుష్

తమిళ అగ్ర హీరో ధనుష్‌ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘నిలవుకు ఎన్‌ మేల్‌ ఎన్నాడి కోబమ్‌’. ఈ సినిమా తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవీష్‌, అనిఖా సురేంద్రన్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌, మాథ్యూ థామస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలుగులో రిలీజ్‌ చేసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్నందించారు. గతంలో ధనుష్‌ దర్శకత్వంలో వచ్చిన పాండి, రాయన్‌ చిత్రాలు భారీ విజయాల్ని సాధించాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ మూవీ టీజర్, ట్రైలర్స్ తోనే భారీ అంచనాలు నెలకొల్పగా.. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. దర్శకుడిగా ధనుష్‌
ఎలా మెప్పించారు? గత చిత్రాల తరహాలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారా లేదా వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం…

కథ:

ప్రభు (పవిష్‌) ఒక రెస్టారెంట్ లో చెఫ్‌ గా పనిచేస్తూంటాడు. ప్రభు, నీలా (అనికా సురేంద్రన్‌) కొన్నేళ్ల నుండి ప్రేమలో ఉండగా, ఒక్కసారిగా బ్రేకప్ అవుతుంది. ఆ బ్రేకప్ బాధలో నుండి భయటపడే సమయానికి ఇంట్లో వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేస్తారు. అయితే పెళ్లి చూపుల్లో ప్రీతి (ప్రియా ప్రకాష్‌ వారియర్‌)ని చూసిన ప్రభుకి వారిద్దరూ చిన్నప్పుడు క్లాస్‌మేట్స్‌ అనే విషయం అర్థమవుతుంది. దాంతో ఒక వారం రోజులు కలిసున్న తర్వాత పెళ్లి గురించి డెసిషన్ తీసుకోవాలి అనుకుంటారు. ఆలాంటి పరిస్థితుల్లో ప్రభుకి తన మాజీ ప్రేయసి నీలా వెడ్డింగ్ కార్డ్ అందుతుంది. దీంతో ప్రభు కుంగిపోతాడు. ఆ పెళ్లికి వెళ్ళాలి అనుకుంటాడు. ఇది చూసిన ప్రీతి వారిద్దరి ప్రేమ కథని​ తెలుసుకుని ఓ నిర్ణ‌యం తీసుకుంటుంది. మ‌రి ఆ నిర్ణ‌యం ఏంటి? ఆ నిర్ణయం​ క‌థ‌ను ఎలా మ‌లుపు తిప్పింది? నీలా నాన్నతో ప్రభుకి మధ్య సమస్య ఏంటి? వీరిద్దరి బ్రేకప్‌ చెప్పుకోవడానికి కారణమేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాను థియేటర్లలో చూడాల్సిందే…

విశ్లేషణ:

ధ‌నుష్ ఇది త‌న కోసం రాసుకొన్న క‌థ‌. తానే హీరోగా చేద్దామ‌నుకొన్నాడు. కానీ ఆఖర్లో నిర్ణ‌యం మార్చుకొని త‌న మేన‌ల్లుడి ప‌వీష్ కి ఆ పాత్ర ఇచ్చేశాడు. రొటీన్‌ లవ్‌ స్టోరీస్‌ని కాస్త ఎంగేజింగ్‌గా, ఎంటర్‌ టైనింగ్‌గా ఈ మూవీలో ధనుష్ చెప్పేశాడు. ఇందులో ప్రభు పాత్రలో పవిష్‌ చక్కగా నటించాడు. తొలి సినిమా అనే భయం అతనిలో కనిపించలేదు. నటనలో మేనమామ ధనుష్‌ మేనరిజం కనిపించింది. నీల‌గా అనికా సురేంద్ర‌న్ చాలా ప్రెట్టీగా క‌నిపించింది. ప‌విష్‌తో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకుల​ను ఆక‌ట్టుకుంటుంది. హీరో ఫ్రెండ్‌ రాజేష్‌ పాత్రలో మ్యాథ్యూ థామస్‌ తెరపై కనిపించిన ప్రతిసారీ నవ్వులు పూయించాడు. ప్రియాంక అరుళ్‌ మోహ‌న్ చేసిన గోల్డెన్ స్పారో అనే స్పెషల్​ సాంగ్​ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. ప్రియా వారియ‌ర్ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. రబియా అందంగా కనిపించడమే కాక నటనతోనూ అలరించింది.

ఈ సినిమాకు జీవీ క్రాష్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు మన తెలుగు ప్రేక్షకులకి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ధనుష్ తెరకెక్కించాడు. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి కొత్త ఫీల్ తీసుకొచ్చింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రేమలో పడడం, బ్రేకప్ అవడం, మరో అమ్మాయి జీవితంలోకి రావడం సాధారణంగా ప్రతీ అబ్బాయి జీవితంలో జరిగే రొటీన్ స్టొరీ. కానీ దీనిని యూత్ కి ఎంగేజ్ చేస్తూ ధనుష్ తెరకెక్కించిన విధానం బాగుంది. రొమాన్స్ కు తావు లేకుండా ప్రేమలోని బాధను, విలువను మాత్రమే ప్రతిబింబిస్తూ ధనుశ్​ క‌థ‌ను న‌డిపిన విధానం బాగుంది.

ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
సెకండాఫ్
ధనుష్ టేకింగ్
పవిష్, మ్యాథ్యూ నటన

మైనస్‌ పాయింట్స్‌:
ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్
క్లైమాక్స్

రేటింగ్: 3/5