‘హరిహర వీరమల్లు’ పోస్ట్‌పోన్‌..క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

by | Feb 19, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్​తో పుర్తయ్యేందుకు సిద్ధవుతోంది.

ఈ సినిమాను మార్చి 28న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవల ‘హరిహర వీరమల్లు’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదని దాంతో ఈ సినిమా అనుకున్న తేదీన విడుదల కాకపోవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు చిత్ర నిర్మాత ఏఎం రత్నం స్పందించారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కచ్చితంగా అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ వచ్చే వారంలో పూర్తి కానుంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి అనుకున్న తేదికే విడుదల చేయనున్నాం’ అని ఏఎం రత్నం తెలిపారు.

కాగా, 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాలోని ‘కొల్లగొట్టిందిరో..’ అంటూ సాగే సెకండ్ సింగిల్ ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.