తెలంగాణ కాంగ్రెస్‌లో ‘రాజ్యసభ’ వార్: ఆ ఒక్క సీటు ఎవరికి?

by | Feb 20, 2026 | రాజకీయాలు

రాజకీయాల్లో పదవులు ఎవరినీ వెతుక్కుంటూ రావు.. వ్యూహాలు, పైరవీలు, విధేయత.. ఇవే పదవులను నిర్ణయిస్తాయి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో (Congress) సరిగ్గా ఇదే జరుగుతోంది. గాంధీ భవన్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే ‘రాజ్యసభ’ రేసు! రాష్ట్రంలో రెండు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు స్థానాలు దక్కడం ఖాయం. కానీ, ఈ రెండు కుర్చీల కోసం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న యుద్ధం అంతా ఇంతా కాదు. ఒక సీటును జాతీయ నాయకత్వానికి, అంటే ఢిల్లీ పెద్దల కోటాకు రిజర్వ్ చేశారని దాదాపు ఖరారైపోయింది. ఇక మిగిలింది.. ఆ ఒక్క సీటు. కానీ ఆ ఒక్క సీటు కోసం పోటీ పడుతున్నది ఏకంగా ఆరుగురు ఉద్ధండులు! ఈ ఆరుగురిలో ఎవరి బలాలు ఏంటి? ఎవరి బలహీనతలు ఏంటి? అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిపోర్ట్ ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది? అనేది చూద్దాం.. ముందుగా జాతీయ కోటా విషయానికి వద్దాం. కాంగ్రెస్ అధిష్టానానికి ట్రబుల్ షూటర్, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ. పార్టీకి న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు, సుప్రీంకోర్టులో కాపాడుతున్నది ఆయనే. గతంలో హిమాచల్ ప్రదేశ్‌లో క్రాస్ ఓటింగ్ వల్ల రాజ్యసభ సీటు కోల్పోయిన సింఘ్వీకి, ఇప్పుడు తెలంగాణ కోటా నుండి సేఫ్ గా పెద్దల సభకు పంపాలని హైకమాండ్ డిసైడ్ అయ్యింది. ఇందులో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. అంటే, రెండు సీట్లలో ఒకటి ఫిక్స్!

కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. ఒక సీటు ఢిల్లీ వాళ్లు తీసుకుంటే, మరో సీటు కచ్చితంగా తెలంగాణ లోకల్ నాయకులకే ఇవ్వాలని సీనియర్లు పట్టుబడుతున్నారు. ఈ రేసులో ఆరుగురు ఉద్ధండులు తమదైన శైలిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఒక్కొక్కరి ట్రాక్ రికార్డ్ చూద్దాం:

1. సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) : రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నాయకుడు. రీసెంట్‌గా ‘ఇండియా’ కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన అనుభవం పెద్దల సభలో పార్టీకి ప్లస్ అవుతుందని ఒక వర్గం వాదిస్తోంది.

2. వేం నరేందర్ రెడ్డి (Vem Narendar Reddy) : ఈ పేరు చెప్పగానే సీఎం రేవంత్ రెడ్డి గుర్తుకొస్తారు. సీఎంకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత సీఎం సలహాదారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డికి వెన్నెముకలా నిలబడ్డారు. వ్యూహాత్మకంగా పార్టీని నడిపించడంలో ఆయన దిట్ట. రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఆయనకే ఉంటాయా? అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.

3. జీవన్ రెడ్డి (Jeevan Reddy) : కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనగానే గుర్తొచ్చే పేరు జీవన్ రెడ్డి. ఉత్తర తెలంగాణలో బలమైన నాయకుడు. సీనియారిటీ పరంగా చూసుకుంటే తనకు అవకాశం ఇవ్వాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు.

4. మధుయాష్కి గౌడ్ (Madhu Yashki Goud) : రాహుల్ గాంధీ కోటరీలో ముఖ్య నాయకుడు. జాతీయ స్థాయిలో మంచి పరిచయాలు ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి, బీసీ కోటాలో తనకు రాజ్యసభ ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు.

5. కె. కేశవరావు (KK): ఈయన ఈక్వేషన్ చాలా ప్రత్యేకం. బీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే, ఆ పదవికి రాజీనామా చేసి మరీ సొంత గూటికి వచ్చారు. నేను త్యాగం చేసి వచ్చాను కాబట్టి, ఆ సీటు నాకే ఇవ్వాలి” అనేది ఆయన ప్రధాన వాదన. ఇది నైతికంగా బలమైన పాయింట్.

6. వి. హనుమంతరావు (VH): కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడు. గాంధీ కుటుంబం పట్ల అంకితభావం ఉన్న బీసీ నేత. “నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ గొంతుకగా గర్జిస్తాను” అని వీహెచ్ ధీమాగా ఉన్నారు.

వీరంతా ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. కానీ, ఫైనల్ డెసిషన్ ఎవరిది? ఇక్కడ మూడు ప్రధానాంశాలు లెక్కలోకి వస్తాయి: మొదటిది: సామాజిక సమీకరణలు. రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా? లేక బీసీ వర్గాన్ని ఆకట్టుకుంటారా? రెండోది: పార్టీకి భవిష్యత్తు అవసరాలు. మూడోది: సీఎం రేవంత్ రెడ్డి నివేదిక. రాష్ట్రంలో పార్టీని సమన్వయపరుస్తూ, ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి మాటను అధిష్టానం కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. సీల్డ్ కవర్లు ఓపెన్ అయ్యేవరకు ఉత్కంఠ తప్పదు. మరి ఈ రాజకీయ చదరంగంలో రాజ్యసభ పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలి.