KCR Birthday Special Story :కేసీఆర్ లేకపోతే తెలంగాణ  వచ్చేదా.. ?  

by | Feb 17, 2026 | రాజకీయాలు

KCR Birthday Special Stroy  : కేసీఆర్ (KCR) లేకపోతే తెలంగాణ (Telangana) వచ్చేదా.. ?   చరిత్ర చెప్పే నగ్న సత్యం..!

చరిత్రలో కొన్ని పేర్లు కేవలం వ్యక్తుల పేర్లుగా మిగిలిపోవు. అవి ఒక జాతి ఆకాంక్షకు ప్రతీకలుగా, ఒక ప్రాంత విముక్తికి చిరునామాగా మారుతాయి. దశాబ్దాల బానిస సంకెళ్లను తెంచుకోవడానికి ఒక జాతి చేసిన నెత్తుటి సంతకానికి సాక్షిగా నిలుస్తాయి. తెలంగాణ… ఈ పదం వెనుక ఎంతటి ఆవేదన ఉందో, అంతటి పోరాట పటిమ ఉంది. వేలమంది అమరుల త్యాగాలు ఉన్నాయి. ఆ త్యాగాల పునాదుల మీద, కోట్లమంది ప్రజల గుండె చప్పుడును విన్న ఒక నాయకుడు, ఆ ఆకాంక్షను తన భుజానికెత్తుకున్నాడు. ఆ పేరే… కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కేసీఆర్… ఈ మూడు అక్షరాలు ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిరూపం. కానీ ఈరోజు జరుగుతున్నదేమిటి? ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ, ఒక చరిత్రను, ఒక నాయకుడి పోరాటాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. కేసీఆర్ అనే ఒక శక్తిని, ఒక వ్యక్తిగా మాత్రమే చూపించే కుట్ర జరుగుతోంది. అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం చరిత్రలోకి వెళ్లాలి. ఇది ఒక నాయకుడి కథ కాదు, మన తెలంగాణ కథ. తెలంగాణ తన విముక్తి కోసం పోరాటం ఈనాటిది కాదు, దశాబ్దాలుగా పోరాడింది. ఈ నేల తల్లి విముక్తి కోసం వేలమంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వివిధ సామాజిక ఉద్యమాలకు ఊపిరి పోసిన గడ్డ మనది. గుర్తుచేసుకోండి… మొట్టమొదట రాష్ట్రాల విభజనపై వేసిన ఫజల్ అలీ కమిషన్ నుండి, మొన్నటి శ్రీకృష్ణ కమిటీ వరకు, తెలంగాణ ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినా, పాలకులు పెడచెవిన పెట్టారు.

1952లో ‘నాన్ ముల్కీ గోబ్యాక్’ అంటూ గర్జించినా, 1969లో ప్రత్యేక రాష్ట్రం కోసం రోడ్లెక్కినా… మనకు మిగిలింది లాఠీ దెబ్బలు, తూటాల గాయాలే. ప్రభుత్వ దమనకాండలో ఎంతోమంది బిడ్డలు రాలిపోయారు. ప్రజాస్వామ్యానికి పర్యాయపదంగా నిలిచే ఎన్నికల్లో సైతం ఓటు ద్వారా మన నిరసన తెలిపాం. కానీ రాజకీయ పరిష్కారం మాత్రం లభించలేదు. “తెలంగాణ” అనే పదాన్ని వాడితేనే నేరం అనే స్థాయికి పరిస్థితి దిగజారింది. తెలంగాణ అంటే నక్సలైట్ అని ముద్ర వేశారు. ఎన్‌కౌంటర్ల పేరుతో వందలాది మందిని పొట్టనబెట్టుకున్నారు. పల్లెలు కన్నీరు పెట్టాయి. యువకులు గ్రామాల్లో ఉండాలంటేనే భయపడే పరిస్థితి. ఒక చీకటి రాజ్యం అది. మన భాషను హేళన చేశారు. మన సంస్కృతిని అవమానించారు. మన నీళ్లను దోచుకున్నారు. మన నిధులను మళ్లించారు. మన పిల్లల ఉద్యోగాలను కొల్లగొట్టారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించే గొంతు కోసం తెలంగాణ ఎదురుచూస్తున్న సమయం అది. సరిగ్గా ఆ చారిత్రక సంక్షోభంలో, ఆ చీకటి సమయంలో… ఒక ఆశాకిరణంలా పురుడు పోసుకుంది తెలంగాణ రాష్ట్ర సమితి. 2001… కేసీఆర్ అనే ఒక వ్యక్తి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అది. అప్పటి వరకు ముక్కలు చెక్కలుగా ఉన్న ఉద్యమాలను, చెల్లాచెదురుగా ఉన్న ఆకాంక్షలను ఒక రాజకీయ వేదికపైకి తీసుకురావాలనే కేసీఆర్ ఆలోచన, తెలంగాణ ప్రజల్లో కొండంత ధైర్యాన్ని నింపింది.

కేసీఆర్ చేసిన మొదటి యుద్ధం… ‘భయం’ మీద. తెలంగాణ అనే పదాన్ని పలకాలంటే భయపడే రోజుల్లో, ఆ పదాన్నే తన పార్టీ పేరుగా పెట్టుకుని నినదించారు. రాజకీయ వ్యక్తీకరణకు కేంద్ర బిందువుగా మారారు. అది సామాన్యమైన ప్రయాణం కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో కుట్రలు. కానీ కేసీఆర్ వెనకడుగు వేయలేదు. అనేక వర్గాల సహకారంతో, టిఆర్ఎస్ ను ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచారు. ఇది జాతీయ రాజకీయాల్లోనే ఒక కీలక పరిణామం. కేసీఆర్ కేవలం ఒక ప్రాంతీయ నేత కాదు, ఒక జాతీయ సమస్యకు పరిష్కారం చూపే దిక్సూచిగా మారారు.

కేసీఆర్ విజయ రహస్యం ఏంటి? ఆయన ప్రజల మనిషి. ప్రజల భాషలో మాట్లాడారు. గ్రామీణ యాసలో ఉన్న పట్టుతో, తెలంగాణ గుండె ఘోషను ఢిల్లీ పీఠం కదిలేలా వినిపించారు. అప్పటిదాకా జరిగిన అన్యాయాలను, వివక్షను, ఉద్దేశపూర్వకంగా చేసిన అసమాన అభివృద్ధిని సామాన్యుడికి అర్థమయ్యేలా వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం… ఈ నాలుగు పదాలు కేసీఆర్ నోటి నుండి తూటాలుగా మారాయి. తెలంగాణను ఒక కొలిమిగా మార్చాయి. ఆయన ఆలోచన ఒక ఆరని అగ్ని జ్వాలగా మారింది. ఫ్రీజోన్ ఉద్యమం ఉధృతమైనప్పుడు, ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనలకు బేషరతుగా మద్దతు ప్రకటించారు. అన్ని ఉద్యమాలకు కేసీఆర్ కేంద్ర బిందువుగా మారారు. కేసీఆర్ ఒక అపర చాణక్యుడు. ఉద్యమం అంటే కేవలం నినాదాలు కాదు, వ్యూహం అని నిరూపించారు. 32 రాజకీయ పార్టీలను, సబ్బండ వర్ణాలను ఒకే తాటిపైకి తెచ్చి ‘జేఏసీ’ నిర్మించారు.

సకల జనుల సమ్మెతో పాలన స్తంభించింది. మిలియన్ మార్చ్ తో ట్యాంక్ బండ్ దద్దరిల్లింది. సడక్ బంద్, రైల్ రోకో… ఒక్కటేమిటి, తెలంగాణ ఒక యుద్ధరంగంగా మారింది. విద్యార్థుల బలిదానాలు చూసి కేసీఆర్ గుండె తల్లడిల్లింది. ఆ ఆవేదనే ఆయనను ఒక కఠినమైన నిర్ణయం వైపు నడిపించింది. చరిత్రలో కొన్ని క్షణాలు ఉంటాయి.. అవి యుగాలను మారుస్తాయి.. 2009, నవంబర్ 29. కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన రోజు. అది మామూలు దీక్ష కాదు. చావు నోట్లో తలపెట్టిన సాహసం. “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో” అంటూ ఆయన చేసిన ఆ ఒక్క భావోద్వేగ ప్రకటన… ప్రతి తెలంగాణ బిడ్డ గుండెను పిండేసింది. యావత్ భారతదేశాన్ని కదిలించింది. ఆసుపత్రి బెడ్ మీద, చిక్కిపోయిన శరీరంతో ఆయన ఉన్నా, ఆయన కళ్ళలో తెలంగాణ సాధించాలనే కసి మాత్రం తగ్గలేదు. ఆయన దీక్షతో తెలంగాణ ప్రజల్లో “ఏర్పాటు ఖాయం” అనే విశ్వాసం కలిగింది. కేంద్రం దిగివచ్చింది. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించింది. కానీ, సీమాంధ్ర పాలకుల కుట్రలతో ఆ ప్రకటన వెనక్కి వెళ్లింది. మళ్ళీ ద్రోహం. కానీ కేసీఆర్ అలసిపోలేదు. ప్రజల సహకారంతో ఆ కుట్రలను ప్రతిఘటించారు. మొక్కవోని దీక్షతో, అలుపెరగని పోరాటంతో, చివరకు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో సగర్వంగా ఆవిష్కరించిన చరిత్రకారుడిగా నిలిచారు.

ఆ జెండా ఎగరేసినప్పుడు… అది కేవలం ఒక రాజకీయ విజయం కాదు, కోట్ల మంది ప్రజల దశాబ్దాల కల సాకారమైన క్షణం. రాష్ట్రం సాధించడమే కాదు, దాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కూడా ఒక సవాలే. కొత్త రాష్ట్రం, ఎన్నో అనుమానాలు, కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఎండిపోయిన పొలాలు. కానీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ అద్భుతాలు సృష్టించారు. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారాలు చూపారు. కరెంట్ కోసం తల్లడిల్లిన తెలంగాణలో 24 గంటల వెలుగులు నింపారు. మిషన్ కాకతీయతో చెరువులకు జీవం పోశారు. కాళేశ్వరం లాంటి మహాద్భుతమైన ప్రాజెక్టుతో బీడు భూములను సస్యశ్యామలం చేశారు. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పు దేశానికే ఆదర్శం. రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రపంచవ్యాప్తంగా  ప్రశంసలు అందుకున్నాయి. చిన్న రాష్ట్రాల పరిపాలన ఎలా ఉండాలో దేశానికి చేసి చూపించారు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే… ఈరోజు కొందరు ఎన్నికల ఫలితాలు చూసి, కేసీఆర్ చరిత్రను తెరమరుగు చేసే కుట్రపూరిత రాజకీయాలకు తెర లేపుతున్నారు. రాష్ట్ర సాధన కోసం తపించి, అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఒక ఉద్యమ నేతను తీవ్రంగా నిందించడం సమాజం సహించదు. కేసీఆర్ వ్యక్తి కాదు, ఇప్పుడు ఒక శక్తి. ఆ శక్తిని చూసి కొన్ని పార్టీలు భయపడుతున్నాయి. ప్రభుత్వ విధానాలను విమర్శించండి, తప్పులేదు. ప్రజల కేంద్రంగా పరిపాలన జరగాలని కోరుకోండి, తప్పులేదు. కానీ, ఒక ఉద్యమకారుడి అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు.

కేసీఆర్ ప్రజల సమస్యలపై నిబద్ధతతో ఆలోచించడం వల్లనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైంది. తనను నిందించినా, నిబ్బరంగా ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు సాగడం ఆయన రాజనీతి. రాజకీయాల్లో విలువలు ఉండాలని నేర్పిన అరుదైన నేత ఆయన. కేసీఆర్ అనే పేరు… ఈ గాలిలో, ఈ నీటిలో, ప్రతి తెలంగాణ బిడ్డ గుండెలో ఎప్పటికీ నిలిచిపోతుంది.