టాలీవుడ్ లో గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు యువ కథానాయకుడు నితిన్ (Nithin). టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్‌తో తన తదుపరి సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇది నితిన్ కెరీర్లో 36వ సినిమాగా తెరకెక్కనుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ (Srinivasa Silver Screen) బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీ నిర్మించనున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ (First Look) ఫోటో రిలీజ్ చేయగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని తెలిసింది. ఇందులో నితిన్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని చెబుతున్నారు. అన్నదమ్ముల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుందని సమాచారం. ఈ రెండు పాత్రలు భిన్న కోణాల్లో సాగుతాయని, ఓ క్యారెక్టర్ నెగెటివ్‌గా ఉంటుందని చెబుతున్నారు. అయితే నితిన్ కు ద్విపాత్రాభినయం కొత్తేమి కాదు. ఇప్పటికే గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు.
ఇదిలావుంటే.. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నితిన్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ (Geetha Arts) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. ‘ఆయ్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అంజి కె. మణిపుత్ర ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇటీవల నితిన్‌ను కలిసిన అంజి కె. మణిపుత్ర ఆయనకు కథ వినిపించారని, నితిన్ వెంటనే ఓకే చెప్పారని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉందని, అంజి కె. మణిపుత్ర టీమ్ స్క్రిప్ట్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. కాగా, గత కొన్ని రోజులుగా హీరో నితిన్ సరైన హిట్ సాదించలేదన్న సంగతి తెలిసిందే. గత పదేళ్ల కాలంలో నితిన్ నటించిన చిత్రాలలో భీష్మ మాత్రమే సూపర్ హిట్ గా నిలిచింది. గతేడాది భారీ అంచనాలతో వచ్చిన తమ్ముడు సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

