భారత్ సినీ చరిత్రలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా సినిమాలపై మక్కువతో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీని శాసించే అగ్ర హీరోగా ఎదిగారాయన. స్వయంకృషి, స్వీయ ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వచ్చిన చిరంజీవి (Mega Star Chiranjeevi) బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు సృష్టించారు. సినీ కెరీర్‌లో 158 నాటౌట్‌గా ఉన్న చిరు యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులను మీ ఇష్టమైన హీరో ఎవరు అని అడిగేతే చటుక్కున చిరంజీవి పేరు చెబుతారు. సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయ, వ్యాపార, ఇతర రంగాలలో ఎందరో చిరంజీవికి అభిమానులుగా ఉంటారు. మరి ఇంత మంది అభిమానుల మనసులు గెలుచుకున్న చిరంజీవికి ఈ తరంలో ఫేవరేట్ హీరో ఎవరో అనేది తాజాగా దర్శకుడు బాబీ (Bobby) వెల్లడించాడు.
ప్రస్తుతం ఉన్న యువ హీరోలతో యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) మెగాస్టార్ చిరంజీవికి చాలా ఇష్టమైన నటుడని డైరెక్టర్ బాబీ తెలిపాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమాతో పాటుగా నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) సినిమా కూడా బరిలో నిలిచింది. ఈ సినిమాలో తన నట విశ్వరూపంతో నవీన్ పోలిశెట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తాన్ని తన భుజ స్కందాలపై మోసిన నవీన్ పోలిశెట్టి మేనియా కారణంగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని తాను కలిసినపుడు ఆయన నవీన్ పోలిశెట్టి మీద చేసిన వ్యాఖ్యలను దర్శకుడు బాబీ వెల్లడించాడు. మెగాస్టార్ గారు నాతో మాట్లాడుతూ. ‘అనగనగా ఒక రాజు సినిమా అద్భుతంగా ఉందని టాక్ వస్తుంది కదా. ఈ తరం హీరోల్లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి. అతని నటన చాలా బాగుంటుంది’ అని చిరు చెప్పినట్లుగా బాబీ వెల్లడించారు.


