‘డ్రాగన్’ – ఎన్టీఆర్ ఫ్యాన్స్​కు కిక్కిచ్చే న్యూస్

by | Jan 26, 2026 | సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (Dragon) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

తాజాగా ‘డ్రాగెన్’ (Dragon) మూవీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తయింది. ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ ఒక కళ్లు చెదిరే భారీ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఇందులో అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారట. ఎక్కువగా నైట్ ఎఫెక్ట్‌తో రాత్రి సమయాల్లో షూటింగ్ నిర్వహించారట. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ విభాగంలో పని చేస్తున్న ప్రజ్వల్ గౌడ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా మొత్తానికి ఈ షెడ్యూల్ లో చిత్రీకరించిన దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ప్రజ్వల్ గౌడ తెలిపారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మార్క్ ఎలివేషన్లతో పాటు ఎన్టీఆర్ గ్రేస్ తోడైతే బాక్సఫీస్ వద్ద విధ్వంసం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి షెడ్యూల్ షూటింగ్ ఫిబ్రవరి మొదటి వారంలో మొదలవనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) , ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ (NTR Arts) పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.