నిఖిల్ ‘స్వయంభు’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

by | Jan 24, 2026 | సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ (Nikhil) నటిస్తున్న పాన్ ఇండియా చుత్రం ‘స్వయంభు'(Swayambhu) . భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిఖిల్‌ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. పీరియాడికల్ సబ్జెక్ట్‌తో వస్తున్న సినిమా కావడంతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో మేకర్స్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా.. ఆ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదని మేకర్స్ వెల్ల‌డించారు. విజువల్ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ పనులు ఇంకా చాలానే ఉండటంతో ‘స్వయంభు’ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10 వేసవి కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి చివరి లోపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ‘కార్తికేయ 2′(Karthikeya) సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ (Nikhil) ఆ తర్వాత ‘స్పై’, ’18 పేజీస్’ సినిమాలు చేశాడు. కానీ అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. ఈ క్రమంలోనే ‘స్వయంభు’ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు.