భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇండోర్ లో జరిగిన మూడవ వన్ డే మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు 41 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. అంతే కాకుండా 2-1 తేడాతో వన్ డే సిరీస్ ను గెలుచుకుంది.
మొదటి మ్యాచ్ ఓడిపోయినా, తరవాతి రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ని గెలుచుకుంది న్యూజిలాండ్ జట్టు. ఇండోర్ లో భారత జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. అంతే కాకుండా వన్ డే సిరీస్ భారత జట్టుపై ఇండియా లో గెలవడం న్యూజిలాండ్ కు ఇదే మొదటి సారి
338 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల లోటు కష్టాల్లో పడింది. ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులు, కెప్టెన్ శుభ్ మన్ గిల్ 23 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 3 పరుగులు, కె ఎల్ రాహుల్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు
అయితే ఒక పక్క వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ మాత్రం జాగ్రత్త ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్ లతో స్కోర్ బోర్డు ని నడిపిస్తూ వచ్చాడు. విరాట్ కోహ్లీ కి నితీష్ కుమార్ రెడ్డి రూపంలో చక్కని సహకారం లభించింది. నితీష్ కుమార్ రెడ్డి 57 బంతుల్లో 53 పరుగులు చేశాడు. నితీష్ ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, నితీష్ లు ఐదవ వికెట్ కు 88 పరుగులు జోడించారు
నితీష్ అవుట్ అయిన తరవాత వచ్చిన జడేజా 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హర్షిత్ రానా రాకతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. హర్షిత్ రానా నిఖార్సైన అల్ రౌండర్ తరహాలో బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ, హర్షిత్ రానా లు ఆరవ వికెట్ కు 99 పరుగులు జోడించి భారత జట్టు శిబిరంలో ఆశలు చిగురింపచేశారు. భారత జట్టు ఇన్నింగ్స్ లో హర్షిత్ రానా ఆట హైలైట్ అని చెప్పవచ్చు. రానా 43 బంతుల్లో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రానా ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి.
హర్షిత్ రానా అవుట్ అయ్యే సమయానికి భారత జట్టు స్కోర్ ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు. అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ 10 కి పైగా ఉంది. ధాటిగా ఆడే క్రమంలో మరొక 19 పరుగులు జోడించి చివరి మూడు వికెట్లను కోల్పోయింది. వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ 108 బంతుల్లో 124 పరుగులు చేసి తొమ్మిదవ వికెట్ గా వెనుతిరిగాడు
న్యూజిలాండ్ బౌలర్లలో ఫోక్స్, క్లార్క్ లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. స్పిన్నర్ లెనాక్స్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు వికెట్లు తీసుకున్నాడు. జెమీసన్ కు ఒక వికెట్ దక్కింది
అంతకు ముందు టాస్ గెలిచి న భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టుకు ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అర్ష్ దీప్ బౌలింగ్ లో ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ హెన్రీ నికోల్స్ మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తరవాత ఓవర్ మొదటి బంతికి హర్షిత్ రానా బౌలింగ్ లో మరో ఓపెనర్ డేవాన్ కాన్వే 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్ జట్టు ను, ఆ తరవాత వచ్చిన డరిల్ మిచెల్, విల్ యంగ్ లు మూడవ వికెట్ కు 53 పరుగులు జోడించి ఆదుకున్నారు. 30 పరుగులు చేసిన విల్ యంగ్ హర్షిత్ రానా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
ఈ సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న మిచెల్ తో ఫిలిప్స్ జత కలిశాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ సెటిల్ అయిన తరవాత వేగం పెంచి స్కోర్ బోర్డు ను పరిగెత్తించారు. నాలుగవ వికెట్ కు మిచెల్, ఫిలిప్స్ లు 219 పరుగులు జోడించారు.
ఇన్నింగ్స్ 44 వ ఓవర్లో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. 88 బంతుల్లో 106 పరుగులు చేసిన ఫిలిప్స్ అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఫిలిప్స్ ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు, తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. ఫిలిప్స్ అవుట్ అయిన తరవాతి ఓవర్ లో 131 బంతుల్లో 137 పరుగులు చేసిన మిచెల్ కూడా అవుట్ అయ్యాడు, మిచెల్ ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు, పదిహేను బౌండరీలు ఉన్నాయి
చివర్లో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్ వెల్ 18 బంతుల్లో, మూడు సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. క్లార్క్ 11 పరుగులతో బ్రేస్ వెల్ కు చక్కని సహకారం అందించడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయగలిగింది
మొదటి రెండు ఓవర్ల లో రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, చివరకు నిర్ణీత 50 ఓవర్ల లో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ చివరి 60 పరుగులు చేయడానికి 5 వికెట్లను కోల్పోయింది
భారత జట్టు బౌలర్ల లో పేసర్ లు అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రానా లు మూడేసి వికెట్లు తీసుకోగా, అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్ కు మిచెల్ వికెట్ దక్కింది. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నప్పటికీ, స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్ లు ప్రభావం చూపలేకపోయారు.

