రేటింగ్: 2.5/5
విడుదల తేది: 14–01–2026
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, భద్రం, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర, అనంత్, రంగస్థలం మహేష్, సమీరా భరద్వాజ్, రేవంత్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: జె. యువరాజ్
సంగీతం: మిక్కీ జే మేయర్
ఎడిటర్: వంశీ అట్లూరి
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య
రచన: నవీన్ పొలిశెట్టి
దర్శకత్వం: మారి
తెలుగు చిత్రసీమలో తనదైన స్టైల్‌తో యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి దూసుకెళ్తున్నాడు. అద్భుతమైన నటనతో అనతి కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. సినిమా కోసం ఎక్కువ గ్యాప్ తీసుకున్నా కూడా ప్రతీసారి సరికొత్త కాన్సెప్టుతో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. మొదట ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి డిఫరెంట్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన నవీన్ పొలిశెట్టి, ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ రైడ్ ‘జాతిరత్నాలు’తో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేశాడు. అనంతరం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు తాజాగా సంక్రాంతి కానుకగా జనవరి 14న ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాతో మారి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా.. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. టాలెంటెడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో గోదావరి ప్రాంతానికి చెందిన యువకుడిగా నవీన్ పొలిశెట్టి కనిపించాడు. ఈ మూవీ టీజర్, ట్రైలర్లో కనిపించిన కామెడీ, ఫ్యామిలీ ఎలివెంట్స్, టైమింగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అభిమానులకు ఎలాంటి వినోదాన్ని పంచింది? నవీన్ – మీనాక్షి చౌదరి జోడి ఏ మేరకు మెప్పించింది ? నవీన్ పొలిశెట్టి ఖాతాలో మరో హిట్ పడిందా ? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
గౌరవపురం జమీందారు గోపరాజు కుటుంబానికి ఏకైక వారసుడు రాజు(నవీన్ పొలిశెట్టి). అతని తాత దానధర్మాలు చేసి ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుంటాడు. కానీ రాజు మాత్రం ఇప్పటికీ తమ కుటుంబానికి కోట్లాది ఆస్తులున్నాయని గ్రామ ప్రజలను నమ్మిస్తూ జీవితం గడిపేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఒకరోజు రాజు తన బంధువుల వివాహానికి వెళ్తాడు. కానీ అక్కడ రాజుకి ఘోర అవమానం జరుగుతుంది. దాంతో కోట్లకు వారసురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అందరిముందు శపథం చేస్తాడు. ఈ తరుణంలోనే గుడిలో పెద్దపాలెం గ్రామానికి చెందిన జమీందార్ భూపతి రాజు(రావు రమేశ్) ఏకైక కుమార్తె చారులత(మీనాక్షి చౌదరి)ని చూస్తాడు. ఆ తర్వాత చారులత మనసును గెలిచి ఆమెను ప్రేమలో పడేస్తాడు. దాంతో చారులత కూడా తన కుటుంబాన్ని ఒప్పించి, రాజును పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లి అయ్యాక రాజుకు షాకింగ్ విషయం తెలుస్తుంది. రాజు అత్త, మావలు అతనికిచ్చిన షాక్ ఏంటి ? అసలు రాజుకు ఎదురైన కష్టాలేంటి ? అనుకున్నట్లుగానే కోటీశ్వరుల ఇంటికి అల్లుడు అయ్యాడా ? రాజు తన కోసం ఊరు కోసం ఏం చేశాడు ? అనేదే ఈ సినిమా మిగతా కథ.
విశ్లేషణ:
ఇది నిజానికి రొటీన్ కథే. కానీ ఆ కథను తనదైన శైలిలో, అద్భుతమైన ఎలివేషన్లతో కొత్తగా మార్చేశాడు దర్శకుడు మారి. ఎక్కడా అనవసరపు పాత్రలు కానీ, సీన్స్ కానీ లేకుండా తెరకెక్కించాడు. సిట్యువేషనల్ కామెడీ కావడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఫస్టాఫ్ పాత్రల పరిచయాలు, హీరోహీరోయిన్లు కలవడం, పెళ్లి జరగడం, దానికి సంబంధించిన పరిస్థితుల నేపథ్యంలో సాగింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఫస్ట్ హాఫ్ ను నల్లేరు మీద బండిలా నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంకు వచ్చే సరికీ కాస్త తడబడ్డాడు. దాంతో మూవీ గ్రాఫ్ కొంచెం కిందకు పడిపోయింది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను మరింత బలంగా రూపొందించాల్సింది. ముగింపు మాత్రం బావుంది. ఇక నటీనటుల విషయానికొస్తే.. హీరో నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో ఇది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కథనం ఊహకందేలా సాగినా.. నవీన్ పొలిశెట్టి రాసిన పంచ్‌లు, కామెడీ సీన్లతో థియేటర్లు దద్దరిల్లాయి. హీరోయిన్ మీనాక్షి చౌదరి చారులత పాత్రలో ఇమిడిపోయింది. చక్కని అభినయం కనబర్చింది. అలానే తారక్ పొన్నప్ప, రావు రమేశ్, ఛమ్మక్ చంద్ర, మహేశ్, భద్రం తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేమ్ మాస్టర్ రేవంత్ ఇందులోనూ కడుపుబ్బా నవ్వించాడు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా గెస్ట్ రోల్ చేసింది. ఇక సినిమా మేకింగ్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ, వంశీ అట్లూరి ఎడిటింగ్ పర్ ఫెక్ట్ గా ఉన్నాయి. మొత్తంగా సగటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలన్నీ ‘అనగనగా ఒక రాజు’లో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
నవీన్ పొలిశెట్టి నటన
ఫస్టాఫ్
కామెడీ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
కొత్తదనం లేని కథనం

