సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తున్న విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాను సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కథ విజయేంద్ర ప్రసాద్ అందించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందనను తెచ్చుకున్నాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 07, 2027న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు.
అయితే ‘వారణాసి’ చిత్రాన్ని రాజమౌళి (Rajamouli) రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘వారణాసి’ (Varanasi) సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు రాజమౌళి. మొదట్లో ఈ సినిమా కథను రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకునప్పటికీ, తర్వాత ఒకే భాగంలో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. దాదాపు 3 గంటల నిడివితోనే వారణాసి సినిమా థియేటర్లలోకి రానుంది అని స్పష్టం చేశాడు రాజమౌళి. అలానే థియేటర్లలో సినిమా చూసే ఆడియన్స్ ఒక ఐదు నిమిషాలు బోర్ కొట్టినా సరే ఫోన్ చూసుకుంటారు. వారికి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా ఉండేలా సినిమాను చిత్రీకరిస్తున్నాం అని రాజమౌళి అన్నాడు. ఇక ‘వారణాసి’లో రామాయణ (Ramayanam) ఇతిహాసానికి సంబంధించిన ఘట్టాలు ఉండటానికి గల కారణాన్ని కూడా రాజమౌళి తెలిపాడు. తన సినిమాలన్నీ కూడా రామాయణ, మహాభారత (Mahabharatham) ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించినవే అని వెల్లడించాడు. ఈ సినిమాలో యాక్షన్, అడ్వెంచర్, ట్రావెల్ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కలగలిసి ఉంటాయని, అత్యాధునిక టెక్నాలజీతో పాటుగా అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని రాజమౌళి వెల్లడించారు. ఇక రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ‘వారణాసి’ (Varanasi) సినిమా మీద ఉన్న అంచనాలను మరింత పెంచాయి.

