‘వారణాసి’లో నా పాత్ర అదే.. రివీల్‌ చేసిన ప్రకాష్ రాజ్

by | Feb 17, 2026 | సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) . మహేశ్‌బాబు ఇందులో రుద్ర (Rudra) అనే పాత్రలో నటిస్తుండగా.. విలన్‌ ‘కుంభ’గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. ఈ ముగ్గురు పాత్రల ఫస్ట్ లుక్స్‌ను ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేయగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే ‘వారణాసి’ చిత్రంలో మహేశ్‌ బాబుకు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని రూమర్స్‌ కొంతకాలంగా వచ్చాయి. ఈ విషయంపై ఆయనే స్పష్టత ఇచ్చారు. ‘వారణాసి’ మూవీలో మహాశివుడి పరమ భక్తుడిగా నటిస్తున్నానని తాజాగా ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. ఈ పాత్ర తనలోని నటుడి దాహార్తిని తీరుస్తోందని, ఈ రోల్ తన కెరీర్ లో మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

అలాగే మహేష్ బాబు, రాజమౌళిలతో కలిసి మరోసారి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని, తదుపరి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. కాగా, రాజమౌళి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఇప్పటికే విక్రమార్కుడులో నటించిన విషయం తెలిసిందే. ఆపై మహేశ్‌తో కూడా ఆయన కలిసి పలు సినిమాల్లో నటించారు. ఒక్కడు, రాజకుమారుడు, గుంటూరు కారం వంటి పలు సినిమాల్లో మెప్పించారు. ఇప్పుడు వారణాసిలో వీరిద్దరూ మరోసారి కలిశారు. ఇక కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాను సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండ‌గా, క‌థ విజయేంద్ర ప్రసాద్ అందించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 07, 2027న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.