దశాబ్దాల నిరీక్షణ ; న‌టి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు

by | Feb 17, 2026 | వార్తలు

ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన తెలుగు నటి ప్రత్యూష (Prathyusha) మృతి కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) తుది తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. వివరాల్లోకి వెళ్తే.. సినీ నటి ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుంచి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి రాగా, సిద్ధార్థ రెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. అయితే 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరూ విషం తాగిన స్థితిలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 24న చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా, సిద్ధార్థరెడ్డి కోలుకుని మార్చి 9న డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం ఒక నివేదిక సమర్పించింది.

ఈ క్రమంలోనే ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది. దాంతో అతడిపై 306, 309 సెక్షన్ల కింద సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో 2004లో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. అనంతరం సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, 2011లో కోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను పెంచింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఇటు సిద్ధార్థరెడ్డి, అటు ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థ రెడ్డి అప్పీల్ చేయగా, నిందితుడికి శిక్ష పెంచాలని కోరుతూ సరోజినిదేవీ (Sarojini Devi) పిటిషన్ వేశారు. గతేడాది నవంబర్‌లో ఈ అప్పీల్స్‌పై సుప్రీంకోర్టు వాదనలు విని తీర్పును రిజర్వ్ చేయగా.. తాజాగా వెలువడిన తుది తీర్పులో సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డి (Siddhard Reddy) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానాను సుప్రీం కోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఇక ప్రత్యూష సినీ కెరీర్ ను పరిశీలిస్తే.. నాలుగేళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ భాషల్లో 11 చిత్రాల్లో నటించారు ప్రత్యూష. తెలుగులో ‘రాయుడు’, ‘శ్రీరాములయ్య’, ‘సముద్రం’, ‘కలుసుకోవాలని’ వంటి సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్నారు.