‘టాక్సిక్‌’ Vs ‘ధురంధర్‌ 2’ – బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్!

by | Feb 6, 2026 | సినిమా

‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1, కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ రాకింగ్ స్టార్ హీరో యశ్‌ (Yash) . ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. ఇందులో కియారా అద్వానీ, న‌య‌న‌తార (Nayanathara) , రుక్మ‌ణీ వ‌సంత్ (Rukmini Vasanth) , హుమా ఖురేషి, తార సుతారియా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రం మార్చి 19న విడుద‌ల కానుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కేజీఎఫ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత వ‌స్తున్న మూవీ కావ‌డంతో సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి.

అయితే తాజాగా ‘టాక్సిక్‌’ (Toxic) మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కు సంబంధించి ఒక భారీ డీల్ కుదిరింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) భారీ మొత్తానికి దక్కించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ‘టాక్సిక్’ థియేట్రికల్ రైట్స్ ను రూ. 120 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఒక డ‌బ్బింగ్ చిత్రానికి ఇంత పెద్ద మొత్తంలో డీల్ కుదరడం ఇదే తొలిసారి అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుండగా.. అదేరోజు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడిగా నటించిన స్పై థ్రిల్లర్‌ ధురంధర్‌ మూవీ సీక్వెల్ ‘ధురంధర్‌ 2’ (Durandhar) విడుదల కానుంది. అంతకుముందు ధురంధర్‌ సినిమా గత ఏడాది భారతీయ బాక్సాఫీస్‌ వద్ద సంచనాల్ని సృష్టించిన సంగతి తెలిసిందే. గతేడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. దీంతో మార్చి 19న ఈ రెండు చిత్రాల మ‌ధ్య‌ బాక్సాఫీస్ వద్ద భీకరమైన పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.