మైత్రీతో జతకట్టిన నవీన్ పోలిశెట్టి.. ఈ సారి మ‌రింత క్రేజీగా!

by | Feb 6, 2026 | సినిమా

టాలీవుడ్‌లో ఈ తరం యువ కథానాయకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో నవీన్ పోలిశెట్టి (Navin Polishetty). స్టార్ డమ్ కంటే కూడా కథ, కామెడీనే తన ప్రధాన బలంగా ముందుకెళ్తున్న నవీన్ పొలిశెట్టి ప్రతి సినిమాతో తన మార్కెట్ ను విస్తరించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘జాతి రత్నాలు’తో హీరోగా పరిచయమైన ఆయన, ఆ తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ (Anaganagaa Oka Raju) తో మరోసారి తన నట విశ్వరూపం చూపించారు. జనవరి 14న విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.

అయితే ఈ సినిమా భారీ విజ‌యంపై టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ప్రశంసల జల్లు కురిపించింది. ఈ క్రమంలోనే నవీన్‌ పోలిశెట్టికి ప్రత్యేక అభినందనలు తెలిపింది. అలాగే త‌మ తదుప‌రి చిత్రాన్ని నవీన్ పొలిశెట్టితో చేయబోతున్నట్లుగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుంద‌ని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.