T20 World Cup  : ఇంగ్లాండ్ ని టెన్షన్ పెట్టిన నేపాల్

by | Feb 8, 2026 | క్రీడలు

T20 World Cup : ఇంగ్లాండ్, నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హోరా హోరీగా సాగిందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ నాలుగు పరుగుల తేడాతో గెలిచినా నేపాల్ జట్టు ప్రేక్షకుల మనసును గెలుచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ (England) జట్టు ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒక్క పరుగుకే  అవుట్ అయినా, ఆ తరవాత వచ్చిన బెథెల్, బట్లర్ తో కలిసి రెండవ వికెట్ కు 38 పరుగులు జోడించాడు.  26 పరుగులు చేసిన బట్లర్, ఆ తరవాత వచ్చిన బెంటోన్ కూడా రెండు పరుగులకే అవుట్ అవడంతో 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి న ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో పడింది.

అయితే కెప్టెన్ హ్యారీ బ్రూక్, బెథెల్ లు నాలుగవ వికెట్ కు 71 పరుగులు జోడించారు. బెథెల్ 35 బంతుల్లో 55 పరుగులు (నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లు), హ్యారీ బ్రూక్ 32 బంతుల్లో 53 పరుగులు (మూడు  సిక్సర్లు, నాలుగు ఫోర్లు) చేసి అవుట్ అయ్యారు. వీళ్లిద్దరు అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ 157 పరుగులు. అయితే చివర్లో విల్ జాక్స్ విజృంభించడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్ల లో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగుల స్కోర్ చేయగలిగింది. విల్ జాక్స్ 18 బంతుల్లో 39 పరుగులు (నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్) చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.

అనంతరం 185 పరుగుల లక్ష్యం తో ఛేదన ప్రారంభించిన నేపాల్ (Nepal) జట్టు ఓపెనర్ అసిఫ్ షేక్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాసేపటికే ధాటిగా ఆడుతూ  17 బంతుల్లో 29 పరుగులు చేసిన మరో ఓపెనర్ కుషాల్ భుర్టెల్ అవుట్ అవడంతో, నేపాల్ జట్టు 42 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది

అయితే కెప్టెన్ రోహిత్ పాడెల్, దీపిందర్ సింగ్ ఐరీ లు మూడవ వికెట్ కు 82 పరుగులు జోడించారు.  29 బంతుల్లో 44 పరుగులు చేసిన దీపిందర్ సింగ్ ఐరీ ( ఆరు ఫోర్లు, ఒక సిక్సర్),  34 బంతుల్లో 39 పరుగులు చేసిన రోహిత్ పాడెల్ (రెండు ఫోర్లు,రెండు సిక్సర్లు ) వెంట వెంటనే అవుట్ అవడంతో నేపాల్ జట్టు తడబడింది.

అయితే, ఇక ఇంగ్లాండ్ జట్టు గెలవడం లాంఛనమే అనుకున్న సమయంలో, నేపాల్ ఆటగాడు లోకేష్ బామ్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు సిక్సర్ల తో కాసేపు ఇంగ్లాండ్ బౌలర్లను, కెప్టెన్ హరీ బ్రూక్ ని కాసేపు టెన్షన్ పెట్టాడు.. 

నేపాల్ జట్టు గెలవడానికి, ఆఖరి బంతి కి ఆరు పరుగులు కావాల్సి వచ్చింది. ఆఖరి బంతికి లోకేష్ ఒక పరుగు మాత్రమే చేయగలగడంతో ఇంగ్లాండ్ జట్టు ఊపిరి పీల్చుకుంది.  చివరకు లోకేష్ 20 బంతుల్లో 39 పరుగులు (రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లు) చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.  ఆఖరి ఓవర్ అనుభవజ్ఞుడైన సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు పరుగులే ఇచ్చాడు

చివరకు నేపాల్ జట్టు 20 ఓవర్ల లో ఆరు వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయడంతో నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

అయినా నేపాల్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతమైన ఆట తీరుని కనిపించడమే కాకుండా ఇంగ్లాండ్ జట్టుకు చెమటలు పట్టించింది.  ఈ మ్యాచ్ లో నేపాల్ గెలవాల్సినా, దురదృష్టవశాత్తు నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది.