మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) , సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పెద్ది నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ కూడా పెంచేశాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకోంటుంది.
ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది. నిజానికి పెద్ది చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఇప్పుడు దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే ఈ తేదీకి కూడా సినిమా విడుదలయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసేందుకు దాదాపు నెలన్నర సమయం పట్టేలా ఉంది. అంటే ఈ సినిమా షూటింగ్ మార్చి నెల చివర్లో ముగియనుంది. ఇక ఏప్రిల్ లో ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరగనున్నాయి. ఆపై పాన్ ఇండియా మూవీ కాబట్టి దేశమంతటా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయాలి. ప్రస్తుతం ఉన్న తక్కువ సమయంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా ప్రజల్లోకి వెళ్లాలంటే హీరో రామ్ చరణ్ (Ram Charan) తప్పకుండా ప్రమోషన్స్ లో పాల్గొనాలి. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో సినిమా జనాల్లోకి వెళ్లాలంటే రామ్ చరణ్ రంగంలోకి దిగాల్సిందే. రామ్ చరణ్ ఎంతగా ప్రమోషన్స్ లో పాల్గొంటే అక్కడ మూవీకి అంత హైప్ వస్తుంది. మరి వీటన్నిటికీ ఇప్పుడున్న సమయం సరిపోతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

