‘ది ప్యారడైజ్’ రైట్స్‌కి క‌ళ్లుచెదిరే ధర.. విలన్​గా మోహన్ బాబు!

by | Mar 17, 2025 | సినిమా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, దసరా మూవీ ఫేం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘ది పారడైజ్‌’ మూవీలో నాని (Nani) సరికొత్త పాత్రలో మెస్మరైస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్‌లో వచ్చిన ‘దసరా’ చిత్రం పలు అవార్డులను అందుకోవడంతో ఇప్పుడు రాబోతోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఏర్పడాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాలో సోనాలి కులకర్ణి కీలక పాత్రలో కనిపించనున్నారు. సికింద్రాబాద్ బ్యాగ్డ్రాప్ లో జరిగే కథగా శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కి సంబంధించి ప్ర‌స్తుతం ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.65 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ ఆడియో రైట్స్ 18 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త‌లు వైర‌ల్‌గా మారాయి. ప్ర‌స్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుండగా.. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో మోహన్​ బాబు క్యారెక్టర్ ను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పవర్​ఫుల్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోకు ధీటుగా విలన్ రోల్ ఉండనుందని అంటున్నారు. అయితే దీని గురించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్‌ వంటి 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.