‘కోర్ట్‌’ సాలిడ్ కలెక్షన్స్.. 3 రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు!

by | Mar 17, 2025 | సినిమా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వ‌ర్సెస్ ఏ నోబ‌డీ అనేది ఉప‌శీర్షిక‌. ఈ మూవీలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్ర‌శాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ పండుగ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్​ను దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కోర్టు సినిమా కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 24.40 కోట్ల కలెక్షన్లు వసూలు చేయడం విశేషం.

కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సఫీస్ వద్ద మొదటిరోజు రూ. 8.10 కోట్ల వసూళ్లు రాగా, రెండో రోజు రూ. 7.80 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడోరోజు ఆదివారం సెలవు కావడంతో ఏకంగా రూ. 8.50 కోట్లు కలెక్షన్స్‌ వసూలు చేసింది. కోర్ట్ మూవీకి ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా రూ. 2 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. ఈ వీకెండ్ నాటికి కోర్ట్ మూవీ రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముంది. ఇక మనదేశంలోనే కాకుండా ఓవర్సీస్​లోనూ కోర్ట్ మూవీ దుమ్మురేపుతోంది. యూఎస్ లో తాజాగా 600K డాలర్ మార్క్ ను దాటేసిన ఈ మూవీ మిలియన్ మైలురాయి వైపుకు దూసుకెళ్తోంది. అలాగే ఇప్పటివరకు నాని నిర్మించిన సినిమాల్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించగా.. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు.