బాక్సాఫీస్‌ వద్ద ‘శంకరవరప్రసాద్ గారి’ వసూళ్ల సునామీ..

by | Jan 27, 2026 | సినిమా

తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil RavipudI) దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’.(Mana Shankara Vara Prasad Garu) సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. ఈ మూవీ విడుదలైన నాటి నుంచి ట్రేడ్ వర్గాల అంచనాల్ని తలకిందులు చేస్తూ రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాను అమితంగా ఆదరించడంతో థియేటర్లలో ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇటీవలే ట్రిపుల్ సెంచరీ (రూ.300 కోట్లు) సాధించిన ఈ మూవీ ఇప్పుడు 15 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.358 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

‘బాస్ వచ్చాడంటే.. రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే.. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన సత్తా చాటుతూ తెలుగు సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఇంతటి భారీ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు’ అంటూ చిరంజీవి పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఈ మూవీ పూర్తి థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి వసూళ్ల పరంగా మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా భారీ పెద్ద ఎత్తున జరిగింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ దాదాపుగా రూ.105 కోట్లకు అమ్ముడవగా.. మొత్తం ఇండియాలో దాదాపు రూ.120 కోట్లు, ఓవర్సీస్ లో సుమారు రూ.20 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్ దాదాపుగా రూ. 150 కోట్లుగా ఉండగా, ఈ సినిమా కేవలం మొదటి వారం ముగిసేలోపే లాభాల బాట పట్టడం విశేషం. కాగా, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి (Sahu Garapati), సుస్మిత కొణిదెల (Sushmitha Konidela) ఈ చిత్రాన్ని నిర్మించారు.