‘SSMB29’: మహేశ్ – రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

by | Apr 11, 2025 | సినిమా

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథను అందించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ సినిమా వ‌స్తుండ‌టంతో పాటు మ‌హేశ్ బాబు (Mahesh Babu), రాజ‌మౌళి (Rajamouli) కాంబోలో ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేది గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 2027 మార్చి 25న విడుదల కానుందంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది.

అయితే ఈ తేదీకి ఓ ప్రత్యేకత ఉందన్న సంగతి తెలిసిందే. 2022 మార్చి 25న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదలైంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవేదికపై తెలుగు సినిమా సత్తాను చాటుతూ.. ఏకంగా ఆస్కార్‌ అవార్డును గెలుపొంది భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది. ఈ క్రమంలోనే సరిగ్గా ఐదేళ్ల తర్వాత 2027, మార్చి 25న ‘SSMB29’ మూవీని కూడా విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 2027, మార్చి 26 గుడ్ ఫ్రైడే కావడంతో పాటు లాంగ్ వీకెండ్ రావడం కూడా ఈ సినిమాకు కలిసి వస్తాయని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు షెడ్యూల్ లను పూర్తి చేసిన రాజమౌళి మూడో షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా స‌మాచారం. కాగా, ఈ చిత్రం అమెజాన్‌ (Amazon) అడవుల నేపథ్యంలో తెరకెక్కనుండగా.. దీనికి రామాయణంలోని కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకుని, మైథలాజికల్ గా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.