‘మ్యాడ్ స్క్వేర్’ మేనియా.. విడుదలకు ముందే విధ్వంసం

by | Mar 26, 2025 | సినిమా

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. సూప‌ర్ హిట్ చిత్రం మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా వ‌స్తుంది. డెబ్యూ యాక్టర్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కాగా, కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే వచ్చిన సాంగ్స్, టీజర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మ్యాడ్‌ మూవీ మేకర్స్ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. టికెట్‌ బుకింగ్‌ పోర్టల్‌ బుక్ మై షోలో మార్చి నెలలో అత్యధిక ప్రీ బుకింగ్ టికెట్లు విక్రయమైన తొలి చిత్రంగా ఈ సినిమా నిలిచింది. అలాగే మ్యాడ్ స్క్వేర్ (Mad Square) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీంతో యూఎస్ మార్కెట్​లో కూడా ఈ చిత్రానికి మంచి బజ్​ క్రియేట్ అయింది. అక్కడ ఇప్పటికే టికెట్ ప్రీ సేల్స్​లో 1 లక్ష డాలర్ల మార్క్‌ను దాటేసింది. ఒక చిన్న సినిమాకు ట్రైలర్ విడుదలకు ముందే ఈ స్థాయిలో టిక్కెట్ విక్రయాలు జరగడం అనేది విశేషం అని చెప్పొచ్చు. ఇకపోతే సినిమా రిలీజ్​కు మరికొన్ని రోజుల సమయం ఉండడంతో టికెట్స్​ మరింత భారీ సంఖ్యలో అమ్ముడుపోతున్నాయట. అలా ఇప్పుడు యూఎస్​ఏ ప్రీమియర్స్ సేల్స్​లో భారీగా టిక్కెట్లు బుక్ అయ్యాయని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇదిలాఉంటే.. మ్యాడ్ స్క్వేర్‌ (Mad Square) మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ మూవీ రన్ టైమ్ విషయానికొస్తే.. కేవలం 2 గంటల 7 నిమిషాల రన్‌ టైం మాత్రమే ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇది చూస్తుంటే ప్రేక్షకులకు విసుగు రాకుండా ఉండేందుకు మరీ ఎక్కువ రన్‌ టైం లేకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. ఈ మూవీ స్టోరీని పరిశీలిస్తే.. లడ్డుగాని పెళ్లికి వ‌చ్చిన ఫ్రెండ్స్ గ్యాంగ్ బ్యాచిల‌ర్ పార్టీ కోసం గోవాకి వెళ్లగా కథ అక్కడ మలుపు తిరుగుతుందనే స్టోరీ లైన్ తో మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణులు మ్యాడ్ మూవీని మించేలా ‘మ్యాడ్ స్క్వేర్’లో కామెడీ పండించబోతున్నారని తెలుస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.