టాలీవుడ్ యంగ్ హీరో నాని I(Nani) నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. ఈ మూవీలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ పండుగ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజు ఈ మూవీ రూ.8.10 కోట్లు కలెక్షన్లు వసూలు చేయగా, రెండో రోజైన శనివారం రూ. 7.8 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. మొత్తంగా రెండు రోజుల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ‘కోర్ట్’ (Court) మూవీ రూ. 15.90 కోట్లు వసూళ్లు సాధించినట్లు సమాచారం. ప్రస్తుతం వీకెండ్ కావడంతో మూడో రోజైన ఆదివారం ఈ సినిమా కలెక్షన్లు సునాయాసంగా రూ.25 కోట్లు వరకూ చేరుకోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరోవైపు ఓవర్సీస్లోనూ కోర్ట్ (Court) మూవీ సత్తా చాటుతోంది. యూఎస్ లో ఇప్పటి వరకూ 450K డాలర్ మార్క్ చేరుకున్న ఈ సినిమా మిలియన్ మైలురాయి వైపుకు దూసుకెళ్తోంది. అయితే దాదాపు రూ. 11 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ రేంజులో వసూళ్లు రావడంతో మేకర్స్ సంతోషిస్తున్నారు. కోర్ట్ మూవీకి ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా రూ. 2 కోట్లు వచ్చాయని సమాచారం. కాగా, ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.

