హిమాలయాల నుంచి కర్నూలుకి.. ‘అఖండ 2’

by | Mar 16, 2025 | సినిమా

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్. ‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మురళీకృష్ణగా,అఖండ రుద్రసికిందర్‌ అఘోరాగా రెండు విభిన్నమైన పాత్రల్ని బాలయ్య పోషిస్తున్న విషయం తెలిసిందే. అఖండ 2 (Akhanda 2) సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవల జరిగిన మహా కుంభమేళలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత విజయవాడ షెడ్యూల్ లో కూడా కొన్ని సీన్స్ షూట్ చేశారు. అనంతరం హిమాలయాలకు వెళ్లిన చిత్ర బృందం అక్కడి మంచు కొండల్లో బాలయ్య అఘోరా పాత్ర మీద కొన్ని పోరాట ఘట్టాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. హిమాలయాల్లో షెడ్యూల్‌ ముగియగానే కర్నూలులో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో మరో షెడ్యుల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

‘అఖండ 2’ చిత్రంలో బాలయ్య (Balakrishna) డ్యూయెల్‌ రోల్‌లో కనిపించబోతుండగా.. ఈ షెడ్యూల్‌ లో బాలయ్య రెండో పాత్ర పై ఈ కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో జరిగే ఈ షెడ్యూల్ లో బాలయ్యతో పాటు జగపతి బాబు, విలన్ సంజయ్ దత్ తో పాటుగా ముఖ్య తారాగణం పాల్గొంటారని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను పాన్‌ఇండియా స్థాయిలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.