సంక్రాంతి సెలవులంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాసులు కురిపించే రోజులు. సెలవుల్లో తమ పిల్లలతో సరదాగా సమయం గడిపేందుకు పెద్దలు ప్రధానంగా ఎంచుకునేది థియేటర్స్‌లో సినిమా చూడడం. ఇక ఈసారి సంక్రాంతి పండగ వెళ్లి నెల కూడా కాకముందే వచ్చే సంక్రాంతి కోసం కర్చీఫ్ వేశారు కొందరు అగ్ర హీరోలు. అయితే సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటనలు రావడం, చివరి నిమిషంలో కొన్ని సినిమాలు తప్పుకోవడం మామూలే. ఇక 2027 సంక్రాంతి రేసులో ఇప్పటివరకూ షురూ అయిన సినిమాలు అలాగే బరిలో ఉన్న హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) . ప్రస్తుతం చిరు హీరోగా బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం మార్చిలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్న ఈ సినిమాలో చిరును పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారని తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ (Bala Krishna) , దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో ‘NBK111’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ముంబై మాఫియా బ్యాగ్డ్రాప్ లో పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అలాగే ఈ ఏడాది మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) , అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) తో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరితో పాటుగా మరో సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రేసులోకి రావడంతో పోరు రసవత్తరంగా మారింది. 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్‌గా మరో కొత్త సినిమా రానున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు నాగార్జున. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వీరితో పాటు ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారీ’తో సూపర్ హిట్ అందుకున్న ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి తన సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఏదేమైనా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున (Nagarjuna) ఈ నలుగురు అగ్ర హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగితే అది తెలుగు సినీ చరిత్రలోనే అరుదైన సంఘటన అవుతుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

