టాలీవుడ్ కథానాయకుడు సుధీర్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీని ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. జటాధర సినిమా కథ అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ తిరుగనున్నట్లు తెలుస్తోంది. పద్మనాభ స్వామి (Anantha Padmanabha Swamy) సంపద దాని చుట్టూ అల్లుకున్న వివాదాల నేపథ్యంలో కథ సాగనుందని తెలుస్తోంది. జటాధర సినిమా కోసం సుధీర్ బాబు తన లుక్ ని కూడా మార్చేశారు. ఈ సినిమా కోసం సుధీర్ బాబు తన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ చేసుకుంటున్నాడని, ఇందుకోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేక సెట్ లో శరవేగంగా జరుగుతోంది.
అయితే ‘జటాధర’ (Jatadhara) సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె వరుసగా కాల్షీట్స్ కేటాయించింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై సోనాక్షి సిన్హా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ‘జటాధర’ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని.. తను ఈ సినిమా చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు సోనాక్షి సిన్హా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. యాక్షన్, ఆధ్యాత్మిక, అతీంద్రియ అంశాల కలబోతగా తెరకెక్కిన ఈ సినిమాలో తన పాత్ర అద్భుతంగా ఉందని, ఈ పాత్ర తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోవడం ఖాయమని, తన మొదటి తెలుగు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చింది. ఇక ఇటీవలే హీరమండి: డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్‌తో వచ్చిన సోనాక్షి సిన్హా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

