పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( హీరోగా యంగ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ హారర్ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న సినిమా ఇదే కావడంతో భారీ హైప్ నెలకొంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయినట్టు తెలుస్తోండగా.. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ చిత్రం విడుదలకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంది. నిజానికి ‘ది రాజా సాబ్’ (Rajasaab) వేసవి కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో వాయిదా పడింది. ఈ క్రమంలోనే ‘ది రాజా సాబ్’ రిలీజ్ డేట్‌పై ఎప్పుడు క్లారిటీ వస్తుందా అని డైలామాలో ఉండిపోయిన అభిమానుల కోసం ఈ మూవీ డైరెక్టర్ మారుతి రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇచ్చారు.
తాజాగా డైరెక్టర్ మారుతి (Maruthi) తిరుపతి, శ్రీకాళహస్తి క్షేత్రాలను దర్శించుకోగా.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో ప్రభాస్ (Prabhas) ఫాన్స్ ‘రాజాసాబ్’ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇవ్వాలని అడిగారు. దీంతో మారుతి సమాధానమిచ్చారు.. “సినిమా విడుదల అనేది నా ఒక్కడి చేతుల్లోనే లేదు. మా సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థ ఇస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన సీజీ ఔట్పుట్ త్వరలోనే వస్తుంది. ఆ తర్వాత నిర్మాణ సంస్థ దీనిపై అప్డేట్ ఇస్తుంది. ఈ సినిమా షూటింగ్ కొంత పెండింగ్ లో ఉంది. చాలా గ్రాఫిక్స్ సంస్థలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయి. ఈ సినిమాకు నాణ్యమైన ఔట్పుట్ ఇచ్చేందుకు చాలా మంది కష్టపడుతున్నాం మా కష్టాన్ని తెరమీద చూసుకోవాలని మాకు ఉంది. దయచేసి అభిమానులు కాస్త ఓపిగ్గా ఉండండి” అని మారుతి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం దర్శకుడు మారుతి చెప్పిన సమాధానాన్ని బట్టి చూస్తే రాజాసాబ్ విడుదల కోసం మరి కొన్ని నెలలు ఆగాల్సిందేనని అర్థమవుతోంది. కాగా, హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

