ఇది కదా మ్యాచ్ అంటే, ఇది కదా చేజింగ్ అంటే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది
210 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగ్ గుర్క్ ఒక పరుగు చేసి అవుట్ అవగా, వన్ డౌన్ లో వచ్చిన అభిషేక్ పోరెల్ డక్ అవుట్ అయ్యాడు
రెండవ ఓవర్లో నాలుగు పరుగులు చేసిన సమీర్ రిజ్వి అవుట్ అవడంతో, 7 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది ఢిల్లీ క్యాపిటల్స్
ఆ తరవాత వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్, డుప్లెసిస్ లు నాలుగవ వికెట్ కు 43 పరుగులు జోడించాక, 11 బంతుల్లో 22 పరుగులు చేసిన అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. కాసేపటికే 29 పరుగులు చేసిన డుప్లెసిస్ కూడా అవుట్ అయ్యాడు
స్టబ్స్, అశుతోష్ శర్మ లు ఆరవ వికెట్ కు 48 పరుగులు జోడించారు. 22 బంతుల్లో 34 పరుగులు చేసిన స్టబ్స్ అవుట్ అవడంతో క్రీజ్ లోకి వచ్చిన విప్రాజ్ నిగమ్ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల మీద విరుచుకు పడ్డాడు. విప్రాజ్ నిగమ్ 15 బంతుల్లో 39 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ను రేసులోకి తీసుకు వచ్చాడు. విప్రాజ్ నిగమ్, అశుతోష్ శర్మ లు ఏడవ వికెట్ కు 55 పరుగులు జోడించారు
విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్ లు వెంట వెంటనే అవుట్ అవడంతో మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. 10 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన తరుణంలో లేని పరుగుకు, పరిగెత్తి కుల్దీప్ యాదవ్ రన్ అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో 18 పరుగులు చేయాలి. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది
కుల్దీప్ యాదవ్ అవుట్ అయినా తరవాత మూడు బంతులకు అశుతోష్ శర్మ 12 పరుగులు రాబట్టాడు.
చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే 6 బంతుల్లో 6 పరుగులు చేయాలి. లక్నో సూపర్ జెయింట్స్ గెలవాలంటే ఒక వికెట్ తీయాలి.
అయితే 20 వ మొదటి బంతికి హై డ్రామా. షాబాజ్ అహ్మద్ వేసిన బంతికి ఎల్ బి డబ్ల్యూ అప్పీల్ చేశారు లక్నో సూపర్ జెయింట్స్.అయితే ఈ హడావిడిలో రిషబ్ పంత్ స్టంపింగ్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు. ఆ తరవాతి బంతికి మోహిత్ శర్మ సింగల్ తీసి ఆశుతోష్ శర్మ కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. మంచి ఊపు మీదున్న అశుతోష్ శర్మ సిక్సర్ కొట్టి ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ ని గెలిపించాడు
31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేసిన అశుతోష్ శర్మ అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిట 19.3 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, సిద్ధార్ధ్, దిగ్వేశ్, రవి బిష్ణోయ్ లు తలా రెండు వికెట్ లు తీశారు
రెచ్చిపోయిన నికొలస్ పూరన్, మిచెల్ మార్ష్ ; ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 210 పరుగులు
అంతకు ముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. మొదటి వికెట్ కు మార్క్రమ్, మిచెల్ మార్ష్ లు 46 పరుగులు జోడించిన తరవాత మార్క్రమ్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. 17 పరుగుల వద్ద విప్రాజ్ నిగమ్ బౌలింగ్ లో, సమీర్ రిజ్వి క్యాచ్ డ్రాప్ చేయడంతో జీవన దానం లభించిన పూరన్ చెలరేగిపోయాడు
మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులు, నికోలస్ పూరన్ 30 బంతుల్లో 75 పరుగులు చేసి అవుట్ అయ్యారు. వీరిద్దరూ రెండవ వికెట్ కు 87 పరుగులు జోడించారు.
ఆ తరవాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ డక్ అవుట్ అవడం, ఆయుష్ బదోని, శార్దూల్ ఠాకూర్ వెంట వెంటనే అవుట్ అవడం చక చకా జరిగిపోయాయి
కెప్టెన్ రిషబ్ పంత్ తో పాటు ముగ్గురు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్ మన్ లు డక్ అవుట్ అయ్యారు. చివర్లో డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించాడు. 19 బంతుల్లో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు మిల్లర్
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్ లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, విప్రాజ్ నిగమ్,ముకేశ్ కుమార్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు

