మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమాతో సంక్రాంతికి మరో బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న విడుదల కాగా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార (Nayanathara) హీరోయిన్గా నటించగా.. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెప్పించారు. ఇప్పటివరకు తాను తెరక్కించిన తొమ్మిది సినిమాలతోనూ హిట్ కొట్టిన ఏకైక టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే కావడం విశేషం. పటాస్‌తో కెరీర్ మొదలెట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2,ఎఫ్3 చిత్రాలతో మంచి విజయాల్ని అందుకున్నారు. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. గత ఏడాది విక్టరీ వెంకటేష్‌తో తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం భారీ విజయాన్ని అందుకోగా, అదే ఊపుతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో రూపొందించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం తన పదో సినిమాకు కూడా సిద్ధమైపోయారు అనిల్ రావిపూడి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి (Anil RavipudI) తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే మొదలు కానున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించనుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జూన్ నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే వెంకటేష్ (Venkatesh) , అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘ఎఫ్2′,’ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హీరో వెంకటేష్ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsa Kutumbam) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లోగా పూర్తవుతుందని తెలిసింది. దీని తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి సెట్స్ లో చేరుతారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

