2nd ODI : భారత జట్టు పై 358 పరుగులను ఛేదించిన సౌత్ ఆఫ్రికా

by | Dec 3, 2025 | వార్తలు

భారత, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రాయపూర్ లో జరిగిన రెండవ వన్ డే మ్యాచ్ లో  సౌత్ ఆఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  వన్ డే హిస్టరీ లో, ఇండియాలో, ఇది  మూడవ అతి పెద్ద ఛేదన.  మొదటి వన్ డే లో కూడా సౌత్ ఆఫ్రికా పోరాడి ఓడిపోయింది.  349 పరుగులు చేసినా భారత జట్టుకు చెమటలు పట్టించారు

359 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.  ఓపెనర్ డికాక్ 8 పరుగులకే అవుట్ అయ్యాడు.

అయితే కెప్టెన్ బావుమా, ఓపెనర్ మార్కరం లు రెండవ వికెట్ కు 101 పరుగులు జోడించారు.  46 పరుగులు చేసిన బావుమా అవుట్ అయ్యాక, బ్రీజ్ కె తో జత కలిసిన మార్కరం మూడవ వికెట్ కు 70 పరుగులు జోడించారు.  ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఓపెనర్ మార్కరం 98 బంతుల్లో 110 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

అయితే ఆ తరవాత వచ్చిన బ్రెవిస్, బ్రీజ్ కె తో కలిసి నాలుగవ వికెట్ కు 92 పరుగులు జోడించారు.  ధాటిగా ఆడిన బ్రెవిస్ 34 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్సర్లు ఉన్నాయి. బ్రెవిస్ అవుట్ అయిన కాసేపటికే 68 పరుగులు చేసిన బ్రీజ్ కె అవుట్ అవడం, వెంటనే జాన్సెన్ అవుట్ అవడంతో భారత జట్టు గెలుపుపై ఆశలు చిగురించాయి.

అయితే డి జార్జి, బాష్ లు భారత ఆశలపై నీళ్లు చల్లారు.  17 పరుగులు చేసిన డి జార్జి రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు.  బాష్ మాత్రం చివర వరకు ఉండి 15 బంతుల్లో 29 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాకుండా సౌత్ ఆఫ్రికా ను గెలిపించాడు.  బాష్ కు జతగా కేశవ్ మహారాజ్ 10 పరుగులు  చేసి అజేయంగా నిలిచాడు

సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు సమిష్టిగా రాణించి విలువైన భాగస్వామ్యాలు నిర్మిస్తూ 359 పరుగుల టార్గెట్ ను ఛేదించారు.  బావుమా జట్టులోకి రావడం, నాయకత్వం వహించడం కూడా సౌత్ ఆఫ్రికా కు కలిసి వచ్చింది

భారత జట్టు బౌలర్ల లో అర్ష్ దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ లు రెండేసి వికెట్లు తీయగా, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్ లు చెరో ఒక వికెట్ తీశారు

సిరీస్ ను నిర్ణయించే చివరిది,  మూడవ వన్ డే శనివారం జరగనుంది. ఇప్పటికే స్వదేశంలో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు గురైన భారత జట్టు వన్ డే సిరీస్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని సగటు భారత జట్టు అభిమాని కోరుకుంటున్నాడు

అంతకు ముందు టాస్ ఓడిపోయిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.  మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.

ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ లు వెంట వెంటనే అవుట్ అవడంతో (62 పరుగులకు రెండు వికెట్లు) కష్టాల్లో పడిన భారత జట్టును సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఋతురాజ్ గైక్వాడ్ లు మూడవ వికెట్ కు 195 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు

విరాట్ కోహ్లీ, ఋతురాజ్ గైక్వాడ్ లు ఇద్దరు సెంచరీ లు చేయడం విశేషం. ఋతురాజ్ 83 బంతుల్లో 105 పరుగులు, విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 102 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  సుందర్ ఒక పరుగు చేసి రన్ అవుట్ అయ్యాడు. 

ఆ తరవాత వచ్చిన కెప్టెన్ కె ఎల్ రాహుల్ బాధ్యతాయుతంగా ఆడి స్కోర్ ను 300 పరుగులు దాటించాడు.  జడేజా, రాహుల్ లు ఆరవ వికెట్ కు 69 పరుగులు జోడించారు.  కే ఎల్ రాహుల్ 43 బంతుల్లో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  జడేజా 24 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు