‘కింగ్​డమ్​’- ‘ఎన్టీఆర్‌కి రుణపడి ఉంటా’ విజయ్ దేవరకొండ

by | Mar 29, 2025 | సినిమా

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్​డమ్​’. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ క్యారెక్టరైజేషన్‌లో విభిన్న కోణాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 30న విడుదల చేయనున్నారు. అయితే ఈ ‘కింగ్​డమ్​’ మూవీ తెలుగు టీజర్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ (Vijay Devara Konda) ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “కింగ్​డమ్ మూవీ టీజర్​ కోసం వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ (NTR) ఇస్తే బాగుంటుందని అనుకున్నాం. వెంటనే ఆయన్ను కలిసి ఈ విషయం చెప్పాను. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితం, సినిమా తదితర అంశాల గురించి ఎన్టీఆర్ నేను చాలా సమయం మాట్లాడుకున్నాం. ఆ తరువాత ఈ సాయంత్రమే వాయిస్ ఓవర్ చేసేద్దాం అని ఎన్టీఆర్ అన్నారు. దర్శకుడు​
గౌతమ్‌ తిన్ననూరి అందుబాటులో లేరని చెన్నైలో టీజర్‌కు సంబంధించిన మ్యూజిక్‌ వర్క్‌లో ఉన్నారని చెప్పాను. అయినా మరేం ఫర్వాలేదు. నువ్వు ఉన్నావుగా చేసేద్దాం అని ఎన్టీఆర్ అన్నారు. నా టీజర్ కు వాయిస్ ఇచ్చి ప్రాణం పోశారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక మా సినిమా హిందీ టీజర్ కోసం రణ్‌బీర్‌ కపూర్‌ని, తమిళ్ టీజర్ కోసం సూర్యని అడగ్గానే వాయిస్ ఓవర్ ఇచ్చారు వారందరికీ ధన్యవాదాలు” అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

కాగా, ఇటీవల ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండ‌గా.. అణచివేతకు గురైన తన జాతి ప్రజలను రక్షించుకోవడానికి శ్రీలంక సైన్యాన్ని ఎదురించే తిరుగుబాటు నాయకుడిగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ‘కింగ్​డమ్​’ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం ఈ ఏడాది మే 30న, రెండో పార్ట్ ఆ తర్వాత రిలీజ్ అవుతుందని టాక్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍ గా నటిస్తోండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.