యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల టైటిల్ పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కగా.. దేవర మొదటి భాగం గతేడాది సెప్టెంబర్ 27న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే బాక్సఫీస్ వద్ద కూడా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూ.. రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే సినిమా జపాన్‌లో విడుదల కానుంది. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ విడుదలైన బాద్షాతో పాటు ఆర్ఆర్ఆర్ చిత్రాలు భారీ కలెక్షన్లు సాధించాయి. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా జపాన్‌లో మార్చి 28న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ అక్కడి అభిమానులతో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా కొందరు అభిమానులను కలుసుకున్న ఎన్టీఆర్ కి ఒక అమ్మాయి ఉహించని షాకిచ్చింది. ఆమె ఎన్టీఆర్ వద్దకి వచ్చి ఎన్టీఆర్ అన్న నేను మీ ఆర్ఆర్ఆర్ సినిమా చూసి తెలుగు నేర్చుకున్నాను. నేను మీతో తెలుగులో మాట్లాడాలని గత రెండేళ్లుగా ఈ తెలుగు పుస్తకం పట్టుకుని తిరుగుతున్నాను. మీరు నా జీవితానికి రోల్ మోడల్ అని ఆమె అన్నారు.. దీనికి ఎన్టీఆర్ బదులిస్తూ మీ నుండి ఇది నేను ఊహించలేదు. మీరు మా అందరికీ అతిపెద్ద స్ఫూర్తి అని సదరు అమ్మాయికి ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్‌ని ఇచ్చారు. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.
” నాకు జపాన్.. అక్కడికి వెళ్లిన ప్రతీ సారి ఎన్నో మధుర స్మృతులను అందిస్తుంది. ఈసారి ఒక జపాన్ అమ్మాయి నాతో ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని చెప్పడం నిజంగా నన్ను షాక్ కు గురిచేసింది. ఒక సినిమా ఒక అభిమానిని ఒక కొత్త భాష నేర్చుకునేలా ప్రేరేపించడం అనేది నేనెన్నటికీ మరచిపోలేను ఈ సంఘటన నా జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.” అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. అంతకుముందు మొదటి రోజు ప్రమోషన్స్‌లో భాగంగా ప్రివ్యూ థియేటర్లో ఫ్యాన్స్ తో కలిసి సందడి చేశారు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఆయుధ పూజ సాంగ్‌కి స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ జోష్ చూస్తుంటే దేవర మూవీ కచ్చితంగా జపాన్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటించగా.. హిందీ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

