‘కింగ్ 100’పై క్రేజీ అప్‌డేట్.. ఈసారి ఫ్యాన్స్కు పూనకాలే!

by | Jan 28, 2026 | సినిమా

నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కింగ్ నాగార్జున తనదైన నటనతో మూడు దశాబ్దాలుగా అక్కినేని నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌, భక్తి చిత్రాలు ఇలా విభిన్న చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ (Ra Karthik) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోండగా.. నాగ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా ఏ జానర్‌లో రూపొందుతోందన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇందులో కథాపరంగా మాత్రం నాగార్జున మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని, ముగ్గురు హీరోయిన్లు ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే ఈ సినిమాలో ఓ క‌థానాయిక‌గా టబు (Tabu) న‌టిస్తోంద‌ని తెలిసిందే. గ‌తంలో నాగార్జున – టబు కాంబోలో వచ్చిన ‘నిన్నే పెళ్లాడ‌తా’, ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే ఈ సినిమాలో మరో కథానాయికగా ‘నాట్యం’ ఫేమ్ సుస్మితా భ‌ట్ నటించనుందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగార్జున (Nagarjuna) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న మొదటి పాన్‌ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ‘కింగ్ 100’ (King 100_ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘100నాటౌట్‌’ ‘లాటరీ కింగ్‌’ అనే టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ అందుకోలేక‌పోయిన నాగార్జున ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాల‌ని భావిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.