టాలీవుడ్‌లో మరోసారి సినిమాల విడుదల తేదీల విషయంలో సందిగ్ధం మొదలైంది. ఎప్పుడు ఏ సినిమా వస్తుందో, ఏ సినిమా వాయిదా పడుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు పెద్ద సినిమాలన్నీ విడుదల తేదీలను ప్రకటించేసినా.. ఇంకా ఏదో కన్‌ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఒక సినిమా వాయిదా పడినా, ఆ ప్రభావం మిగిలిన సినిమాల విడుదల తేదీలపై పడుతోంది. దాంతో అవి కూడా వాయిదా వేసుకోవాల్సివస్తోంది. ఇది తెలుగు చిత్రసీమకు కొత్త తలనొప్పిగా మారుతోంది. ముందుగా ఫిబ్రవరి13న రిలీజ్ అవ్వాల్సిన నిఖిల్ నటించిన ‘స్వయంభు’ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. మార్చి 27న విడుదల కావాల్సిన రామ్ చరణ్ ‘పెద్ది’ వేసవి కానుకగా మే 1న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అలాగే నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా కూడా మార్చిలో విడుదల కానుండగా.. జూన్ 25న విడుదల చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూలై 10న విడుదల చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇవి పక్కానా అంటే జవాబు దొరకదు. ఒక సినిమా వాయిదా పడితే, మళ్లీ అన్ని సినిమాలూ రిలీజ్ డేట్స్ ను మార్చుకోవాల్సివస్తుంది. ఈ వరుస వాయిదాలతో, కొత్త విడుదల తేదీలతో సినిమాల రిలీజ్ షెడ్యూల్ పూర్తిగా కన్‌ఫ్యూజన్‌గా మారింది. ఫిబ్రవరి దాటితే గానీ, ఈ సినిమాల విషయంలో ఓ స్పష్టత రాదు.

