‘క్రిష్‌ 4’లో హీరోయిన్ ఫిక్స్.. 3 పాత్రల్లో హృతిక్!

by | Apr 13, 2025 | సినిమా

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా ‘క్రిష్‌’ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయన్న సంగతి తెలిసిందే. ‘కోయి మిల్ గయా’, ‘క్రిష్’, ‘క్రిష్ 3’ చిత్రాలు బాక్సఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా ‘క్రిష్‌ 4’ మూవీ వస్తోంది. ఈ చిత్రంలో హృతిక్‌రోషన్‌ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్‌ స్థాయిలో నిర్మించాలని చిత్ర బృందం భావిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హృతిక్‌రోషన్‌ త్రిపాత్రాభినయంలో కనిపిస్తారని తెలుస్తోంది. హీరోగా నటించడంతో పాటుగా విలన్ గా కూడా కనిపించనున్నారట. అలాగే ఈ సినిమాలో హృతిక్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన గత సినిమాల్లో కూడా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా అలరించిన సంగతి తెలిసిందే. వీరిద్దరిదీ సూపర్ హిట్ జోడీగా నిలువుగా.. తాజాగా ‘క్రిష్‌ 4’లోనూ ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది.

ప్రియాంక చోప్రా ప్రస్తుతం ప్రస్తుతం రాజమౌళి-మహేశ్‌బాబు ‘SSMB29’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఇప్పటికే క్రిష్‌ ప్రాంఛైజీలో నటించిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతిజింతా ఇప్పుడు క్రిష్ 4 లోనూ కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. వీరితో పాటుగా బాలీవుడ్ సీనియర్ నటీనటులు వివేక్‌ ఒబెరాయ్‌, రేఖా కూడా క్రిష్ 4లో నటించనున్నారని తెలుస్తోంది. కాగా, హృతిక్ రోష‌న్ హీరోగా న‌టించిన సూప‌ర్ హీరో చిత్రం ‘క్రిష్’ ఎంత పెద్ద హిట్ట‌యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క్రిష్ ఫ్రాంచైజీలో మొద‌టి మూడు భాగాలుగా హృతిక్ రోష‌న్ తండ్రి రాకేష్ రోష‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇప్పుడు తెరకెక్కనున్న క్రిష్ 4తో హృతిక్ రోషన్ దర్శకుడిగా మారబోతున్నాడు. ఇక హృతిక్ రోషన్ సినిమాల విషయనికొస్తే.. 2019లో చేసిన ‘వార్’ మూవీ సూపర్ హిట్ గా నిలువగా తర్వాత వచ్చిన ‘విక్రమ్ వేదా’, ‘ఫైటర్’ సినిమాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.