టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో అరుదైన అవార్డు చేరింది. చిత్ర పరిశ్రమకు ఆయన అందిస్తున్న విశేష సేవలను గానూ యూకే పార్లమెంట్ చిరుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని (Lifetime Achievement Award) అందించింది. తాజాగా యుకే పార్లమెంట్ నుంచి ఈ అరుదైన సత్కారం అందుకున్నారు. చిరంజీవికి (Chiranjeevi) యూకే పార్లమెంట్‌లోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌తో సత్కరించారు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బ్రిటన్ పార్లమెంటు భవనమైన హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ తో పాటుగా రాజకీయ ప్రముఖులు, సినీతారలు, అభిమానులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక గత కొంత కాలంగా చిరంజీవి వరసగా అవార్డులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది భారత దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ ను చిరంజీవి అందుకున్నారు. కాగా, సినీ రంగంలో నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి అందిస్తున్న సేవలకు ఈ అవార్డు అందించినట్లు యూకే పార్లమెంటు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఈ అవార్డు అందుకునేందుకు చిరంజీవి లండన్ చేరుకోగా.. అక్కడ ప్రవాస భారతీయులు, సినీ ప్రేమికులు ఘనంగా స్వాగతం పలికారు.
ఇక చిరంజీవి (Chiranjeevi) నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడుగా, సామాజిక సేవకుడుగా విశేష సేవలందించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల నట ప్రస్థానంలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ ఇతర దక్షిణాది చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు. ఇక సినిమాల విషయనికొస్తే.. చిరంజీవి కథానాయకుడిగా యువ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’ (Viswambhara) . సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

