‘అఖండ-2’: మంచుకొండల్లో భీకర ఫైట్.. సినీ హిస్ట‌రీలో తొలిసారి!

by | Mar 13, 2025 | సినిమా

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్. ‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ను (Akhanda Tandavam) తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మార్చి మూడో వారం నుంచి హిమాలయాల్లో షూటింగ్‌ ప్లాన్‌ చేశారు మేకర్స్. ఇందులో మురళీకృష్ణగా,అఖండ రుద్రసికిందర్‌ అఘోరాగా రెండు విభిన్నమైన పాత్రల్ని బాలయ్య (Bala Krishna) పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే హిమాలయాల్లో అఖండ రుద్రసికిందర్‌ అఘోరా పాత్రపై కీలక సన్నివేశాలను తీస్తారట బోయపాటి. అలాగే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారట. ఇది మూవీలో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచే విధంగా బోయపాటి ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.

సినీ హిస్ట‌రీలో తొలిసారిగా హిమాలయాల్లో ఎవరూ చూపించని లోకేషన్లలో ఈ మూవీ చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్‌లో బాలయ్యతో పాటుగా కీలక పాత్రధారులంతా పాల్గొంటారట. కాగా, ఈ సినిమాను పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుండడంతో వివిధ భాషలనుంచి నటీనటులను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌ సీనియర్ నటుడు సంజయ్‌దత్‌ (Sanjay Dutt) ఈ మూవీలో అఖండ రుద్ర సికిందర్‌ అఘోరాను ఢీకొట్టే విలన్ పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. కాగా, అఖండ 2 సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.