దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను అలరించిన చిత్రాల్లో ఆయిరత్తిల్ ఒరువన్ (యుగానికి ఒక్కడు) ముందు వరుసలో ఉంటుంది. కోలీవుడ్ హీరో కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా మంచి విజయం సాధించింది. ‘రేయ్ ఎవర్రా మీరంతా’ అంటూ కార్తీ పలికిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక చిత్ర నిర్మాణ సంస్థ అయిన డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్ ‘యుగానికి ఒక్కడు’ (Yuganiki Okkadu) మూవీ సీక్వెల్‌పై ఇప్పటికే అనౌన్స్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించనున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజాగా ఈ సినిమా డైరెక్టర్ సెల్వరాఘవన్ (Selva Raghavan) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. యుగానికి ఒక్కడు సీక్వెల్ చేయడం తన కల అని అన్నారు. అలాగే ఈ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రను పోషిస్తారని ఆయన స్పష్టం చేశారు. కానీ, హీరో కార్తీ లేకుండా మాత్రం ఈ సినిమా చేయలేమన్నారు. కార్తీ ఉంటేనే ఈ సినిమాకు సీక్వెల్ కుదురుతుందని, అతను లేకుండా యుగానికి ఒక్కడు సినిమాను అసలు ఊహించుకోలేనని పేర్కొన్నారు. ధనుష్, కార్తీ ఇద్దరూ దాదాపు ఏడాది పాటు ఈ సినిమాకు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ సీక్వెల్ లో ధనుష్ (Dhanush) హీరో అయినప్పటికీ కార్తీ (Karthi) పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచేలా రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ఆధిపత్యం చేస్తున్న కారణంగా ఈ చిత్రాన్ని తీయడం అంత సులభం కాదంటూ సెల్వ రాఘవన్ చెప్పుకొచ్చాడు. ఇక రీసెంట్‌గానే ఈ చిత్రం తెలుగులో రీ రిలీజ్ అవగా ఇప్పుడు కూడా సాలిడ్ కలెక్షన్లు సాధించింది.

