చిరు-అనిల్ మూవీ.. ఉగాదికి రామానాయుడులో షురూ!

by | Mar 29, 2025 | సినిమా

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడనే సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం చిరంజీవి ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభ‌ర చిత్రం చేస్తున్నారు. మెగాస్టార్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ జానర్ లో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడితో చిరంజీవి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఈ క్రేజీ కాంబోకి సంబంధించిన అప్డేట్ ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభానికి చిత్ర బృందం ముహూర్తం ఫిక్స్‌ చేశారు. మార్చి 30న ఉగాది పండుగ సందర్భంగా చిరంజీవి-అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో రానున్న ఈ క్రేజీ మూవీని పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నారు. అదే రోజున రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలెట్టనున్నట్లు తెలుస్తోంది.

రామానాయుడు స్టూడియోలో జరగనున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) తో పాటుగా పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర యూనిట్ పాల్గొంటారని తెలుస్తోంది. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో శంకర్‌ వరప్రసాద్‌ అనే పాత్రలో చిరంజీవి (Chiranjeevi) నటించనున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా.. ఒక హీరోయిన్ గా అదితిరావు హైదరి ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇందులో డ్యూయెట్స్‌ లాంటివి ఉండవని, అభిమానులకు చక్కటి వినోదాన్ని అందించడమే లక్ష్యంగా అనిల్‌ రావిపూడి కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు.