టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanti) పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఇది తల్లీ కొడుకుల బలమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ అని తెలుస్తోంది.
అయితే ఇటీవల ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ఫుల్ డైలాగ్స్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కొనేందుకు బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రలో 12 కోట్లకి పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం సీడెడ్ నుంచే 3.7 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కెరీర్లోనే ఈ సినిమా ఆల్ టైం రికార్డు బిజినెస్ చేసిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా టీజర్ లో కళ్యాణ్ రామ్ మాస్ లుక్ తో పాటుగా విజయశాంతి పవర్ ఫుల్ క్యారెక్టర్ ఈ రేంజ్ బిజినెస్ జరగడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. టీజర్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలివేట్ అయ్యేలా కట్ చేశారు మేకర్స్. తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, వైరం, ఎమోషన్స్, సెంటిమెంట్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది. కాగా, ఈ సినిమాలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్‌గా ఉండగా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.
ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలాఉంటే.. గతంలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ గా వైజయంతి (Vijayanthi) పాత్రలో నటించిన ‘కర్తవ్యం’ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. దాంతో ఈ సినిమాలో కూడా విజయశాంతి పోషిస్తున్న పాత్రకూ వైజయంతి అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అబిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు.

