ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ : ఫైనల్లో సచిన్ సేన

by | Mar 14, 2025 | వార్తలు

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ మొదటి సెమి ఫైనల్ లో ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది

మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ 20 ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది

ఇండియా మాస్టర్స్ జట్టులో కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 30 బంతుల్లో 42 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ శివాలెత్తిపోయాడు. కేవలం 30 బంతుల్లో 7 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 59 పరుగులు చేశాడు.

ఆ తరవాత వచ్చిన బిన్నీ 21 బంతుల్లో 36 పరుగులు, యూసఫ్ పఠాన్ 10 బంతుల్లో 23 పరుగులు, ఇర్ఫాన్ పఠాన్ 7 బంతుల్లో 19 పరుగులతో భారీ స్కోర్ కు బాటలు వేశారు

ఆస్ట్రేలియా మాస్టర్స్ బౌలర్లలో దొహేట్రీ, క్రిస్టియన్ రెండేసి వికెట్లు తీయగా, నైల్, ఓకీఫె, హీలీఫెన్ హస్  తలా ఒక వికెట్ తీశారు

అనంతరం 221 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మాస్టర్స్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ఆరంభించింది. అయితే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా మాస్టర్స్ విజయానికి పరుగుల దూరంలో నిలిచిపోయింది

సిరీస్ లో 3 సెంచరీ లు చేసి సూపర్ ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా మాస్టర్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ 5 పరుగులకే అవుట్ అవడంతో ఆస్ట్రేలియా మాస్టర్స్ వికెట్ల ఖాతా ఓపెన్ చేసింది.  ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్టులో షాన్ మార్ష్ 21 పరుగులు, బెన్ డంక్ 21 పరుగులు, రెయార్డన్ 21 పరుగులు, కటింగ్ 39 పరుగులు చేశారు

ఇండియా మాస్టర్స్ బౌలర్లలో నదీమ్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.  వినయ్ కుమార్, ఇర్ఫాన్ పఠాన్ లు రెండేసి వికెట్లు తీయగా, బిన్నీ, నేగి లు చెరో ఒక వికెట్ తీశారు

ఈ రోజు శ్రీలంక మాస్టర్స్, వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ జట్ల మధ్య రెండవ సెమి ఫైనల్ జరుగుతుంది.  ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో ఇండియా మాస్టర్స్ ఫైనల్ లో మార్చ్ 15 న తలపడుతుంది