‘SSMB29’ : మహేశ్ ౼ రాజమౌళి మూవీ స్టోరీ లైన్‌ ఇదేనా.?

by | Mar 12, 2025 | సినిమా

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ సినిమా వ‌స్తుండ‌టంతో పాటు మ‌హేశ్ బాబు, రాజ‌మౌళి (Rajamouli) కాంబోలో ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కాగా, ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షెడ్యూల్‌ ఇటీవల ఒడిశాలోని కోరాపుట్‌ అటవీ ప్రాంతంలో మొదలైంది. ప్రస్తుతం మహేశ్‌బాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రియాంకా చోప్రాలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

అలాగే ఈ చిత్రం అమెజాన్‌ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుండగా.. దీనికి రామాయణంలోని కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకుని, మైథలాజికల్ గా తెరకెక్కించనున్నారని, ఈ కథ కాశీ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. ఇందులో హనుమంతుడి స్ఫూర్తితో హీరో క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కాశీ ఆలయాన్ని తలపించేలా సెట్స్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఓ వీడియో లీకైన సంగతి తెలిసిందే. మ‌హేశ్ బాబు (Mahesh Babu) న‌డుచుకుంటూ వ‌చ్చి వీల్ చైర్‌లో ఉన్న అత‌డి ముందు మోకాలిపై ఉన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో మరోసారి ఇలాంటివి జరగకుండా చిత్ర యూనిట్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.